పేమెంట్ సెటిల్మెంట్‌పై వీసా కీలక నిర్ణయం, బిట్ కాయిన్ జంప్
క్రిప్టోకరెన్సీకి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకు దిగ్గజ కంపెనీలు పట్టం గడుతున్నాయి. క్రిప్టోకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నందున ఎలక్ట్రానిక్ చెల్లింపుల సంస్థ వీసా కీలక నిర్ణయం తీసుకుంది. ఇథీరియమ్ నెట్ వర్క్ ద్వారా డిజిటల్ కరెన్సీ యూఎస్‌డీ కాయిన్‌లో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. వీసా తాజా నిర్ణయంతో ఈ డిజిటల్ కరెన్సీని సాధారణ నగదు రూపంలో మార్చే అవసరం తప్పుతుంది.

వీసాకు ముందు ఈ కంపెనీలు..
వీసాకు ముందు ఇతర ప్రముఖ సంస్థలైన బీఎన్‌వై మెలన్, బ్లాక్ రాక్, మాస్టర్ కార్డ్ వంటి కంపెనీలు డిజిటల్ కరెన్సీ చెల్లింపులకు పచ్చజెండా ఊపాయి. పెట్టుబడులకు సంబంధించినంత వరకు క్రిప్టోకరెన్సీలు ప్రధాన భాగం కానున్నాయనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వీసా ద్వారా క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు జరపాలనుకుంటే ముందుగా సాధారణ నగదులోకి మార్చవలసి వచ్చేది. ఇప్పుడు ఇథీరియం టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు వీసా అనుమతించింది. దీంతో నగదు మార్పిడి తప్పింది.

టెస్లా నిర్ణయం
ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా ఇంక్ కూడా గతంలోనే బిట్ కాయిన్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు, తమ కస్టమర్లు బిట్ కాయిన్ ద్వారా కొనుగోళ్లు జరపవచ్చునని కూడా ఆ తర్వాత ప్రకటించింది. ఎలాన్ మస్క్ నిర్ణయాల నేపథ్యంలో వాణిజ్య లావాదేవీల్లో క్రిప్టో ఉపయోగం గణనీయంగా పెరిగింది.

బిట్ కాయిన్ జంప్
క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ అంతకంతకూ ఎగిసిపడుతోంది. స్టేబుల్ కాయిన్‌ను ఉపయోగించవచ్చునని వీసా ప్రకటించిన అనంతరం ఇతర క్రిప్టోలతో పాటు బిట్ కాయిన్ కూడా పెరిగింది. బిట్ కాయిన్ 58,000 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. డిజిటల్ కరెన్సీస్‌కు మద్దతు పెరిగితే ఆ ప్రభావం అన్నింటి కంటే ఎక్కువగా బిట్ కాయిన్ పైన కనిపిస్తోంది. దీంతో దీనికి ఆదరణ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications