క్రిప్టో కరెన్సీలు అన్ని కూడా నేడు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 38,000 డాలర్ల మార్కును దాటి, ఓ సమయంలో 39,000 డాలర్ల మార్కును తాకింది. నిన్నటి వరకు 38,000 డాలర్లకు దిగువనే కనిపించిన క్రిప్టో ఇప్పుడు 40,000 డాలర్ల దిశగా పయనిస్తోంది. బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 4.45 శాతం లాభపడి 38,890 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల కనిష్టం 37,110 డాలర్లు, 24 గంటల గరిష్టం 39,002 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 737.58 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ 52 వారాల కనిష్టం 28,825 డాలర్లు, గరిష్టం 68,990 డాలర్లు.
వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 4.40 శాతం ఎగిసి 38,868 డాలర్లు, ఎథేరియం 6.61 శాతం ఎగిసి 2,722 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 0.735913 డాలర్లు, సోలానా 7.61 శాతం ఎగిసి 90.52 డాలర్లు, టెర్రా 14.80 శాతం ఎగిసి 57.22 డాలర్లు, అవాలాంచె 12.58 శాతం ఎగిసి 79.37 డాలర్లు, కార్డానో 9.91 శాతం ఎగిసి 0.9293 డాలర్లు, స్టెల్లార్ 6.28 శాతం ఎగిసి 0.192205 డాలర్లు, పోల్కాడాట్ 5.90 శాతం ఎగిసి 17.14 డాలర్లు, డోజీకాయిన్ 4.46 శాతం ఎగిసి 0.134182 డాలర్లు, షిబా ఇను 8.51 శాతం ఎగిసి 0.000026 డాలర్లు, పాలీగోన్ 9.35 శాతం ఎగిసి 1.54 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

రష్యా-ఉక్రెయిన్ దేశాల ఉద్రిక్తతల నడుమ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ చూస్తున్నారు. కానీ బంగారానికి ప్రత్యామ్నాయంగా భావించిన క్రిప్టో కరెన్సీ మాత్రం ఇలాంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ కుప్పకూలింది. నేడు బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోలు లాభపడినప్పటికీ, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు వెలుగు చూసిన అనంతరం పసిడి పైపైకి చేరుకుంటే, బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలు మాత్రం నేలచూపులు చూశాయి. బిట్ కాయిన్ ఓ సమయంలో 36వేల డాలర్లకు పడిపోయింది. బంగారం అయితే దాదాపు పది నెలల గరిష్టానికి చేరుకుంది. అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు క్రిప్టో కంటే బంగారం వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications