ఎలాన్ మస్క్, డ్రాగన్ కంట్రీ ఎఫెక్ట్: 40,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్
కరోనా వైరస్ వణికిస్తోన్న సమయంలో బంగారానికి ధీటుగా క్రిప్టోకరెన్సీలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రధానంగా క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ 65వేల డాలర్లకు చేరుకుంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇంక్ ఇందులో పెట్టుబడులు పెట్టడంతో బిట్ కాయిన్ ఎగిసిపడింది. అయితే ఇటీవల మస్క్ వ్యాఖ్యల ప్రభావంతో ఈ క్రిప్టో వ్యాల్యూ పడిపోయి 40వేల డాలర్ల దిగువకు చేరుకుంది. ఏడాదిలో ఎంత వేగంగా ఎగిసిపడిందో ఇప్పుడు అంతే వేగంగా దాని వ్యాల్యూ కోల్పోతోంది. ఏప్రిల్ రెండో వారం నుండి ఇప్పటి వరకు 40 శాతం వరకు క్షీణించింది. ఇందుకు ప్రధానంగా ఎలాన్ మస్క్, చైనా కారణాలు.

క్రిప్టో వ్యాల్యూ డౌన్
బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోల వ్యాల్యూ కూడా దారుణంగా పడిపోయింది. వారం రోజుల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 300 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది ప్రస్తుత ఆర్బీఐ విదేశీ కరెన్సీ ఆస్తుల్లో సగమని చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో 63 వేల డాలర్లు ఉన్న బిట్‌కాయిన్ విలువ నేడు 40 వేల డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఎథేరియం దాదాపు 40 శాతం వ్యాల్యూను కోల్పోయింది. ఇటీవలే భారీగా పెరిగిన డోజీకాయిన్ 45 శాతం పడిపోయింది.

బిట్ కాయిన్ వ్యాల్యూ అమాంతం పెరిగింది
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు బిట్ కాయిన్‌పై భారీగా ప్రభావం చూపాయి. మార్చిలో టెస్లా బిట్ కాయిన్ చెల్లింపులను తమ సంస్థ ఆమోదిస్తుందని తెలిపింది. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. 64 వేల డాలర్లు దాటింది. అయితే ఇటీవల పర్యావరణం గుర్తుకు రావడంతో ఏప్రిల్ రెండో వారంలో ఎలాన్ మస్క్ మనసు మార్చుకున్నారు. టెస్లా కార్ల కొనుగోలుకు బిట్ కాయిన్‌లను అనుమతించలేమని ప్రకటించారు. బిట్ కాయిన్ కోసం భారీగా విద్యుత్ వినియోగిస్తుండటంతో పర్యావరణం దెబ్బతినడమే దీనికి కారణమన్నారు. ఈ ప్రకటనతో బిట్ కాయిన్ ఒక్కరోజే 15 శాతం దెబ్బతిన్నది.

చైనా సొంత డిజిటల్ కరెన్సీ
చైనా కొన్ని నెలల క్రితం సొంతంగా ఎలక్ట్రానిక్ కరెన్సీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 2014లో దీనిపై పని చేయడం మొదలు పెట్టింది. 2016లో డిజిటల్ కరెన్సీ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసింది. 2020 నుండి ప్రయోగాత్మక వినియోగం మొదలు పెట్టింది. దీనిని ECNYగా వ్యవహరిస్తోంది. అంటే ఎలక్ట్రానిక్ చైనీస్ యువాన్ అని అర్థం. చాలా బ్యాంకులు తమ నిధుల్లో కొంత భాగాన్ని డిజిటల్ కరెన్సీగా మార్చాలని పేర్కొంది. భవిష్యత్తులో దీనిని ప్రపంచవ్యాప్తం చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications