సంపన్నులకు షాక్ : పదేళ్లలో తొలిసారి తగ్గిన సంపద, కారణాలివే?
కుబేరుల సంపద కరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు వీరి సంపదకు ఎసరు పెడుతున్నాయి. ఈ పరిణామాలను అదుపు చేసే శక్తి తమకు లేని కారణంగా చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది. తాజాగా ప్రపంచంలోని సంపన్నుల సొమ్ము ఏవిధంగా తగ్గిపోయిందో వెల్లడిస్తూ యూబీఎస్, పీ డబ్ల్యూ సి నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం గత పదేళ్ల కాలంలో మొదటిసారి లక్ష్మి పుత్రుల సంపద తగ్గింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఈక్విటీ మార్కెట్లలో ఆనిచ్చిత పరిస్థితులు సంపదను తగ్గించాయని నివేదిక పేర్కొంది.

ఎంత తగ్గిందంటే...
* ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద గత ఏడాదిలో 38,800 కోట్ల డాలర్లు తగ్గి 8.539 లక్షల కోట్ల డాలర్లకు తగ్గిపోయింది.
* గ్రేటర్ చైనాలో సంపద బాగా తగ్గిపోయింది. అమెరికా తర్వాత చైనాలోనే అత్యధికంగా బిలియనీర్లు ఉన్నారు.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం
* అమెరికా - చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వల్ల అనేక విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసింది. ఈ యుద్ధ ప్రభావం ప్రయివేట్ రంగంలోని బ్యాంకులపై కూడా పడింది. దీనికి భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది కాలంలో బ్యాంకుల కస్టమర్లు ట్రేడింగ్ కు దూరంగా ఉన్నారు. మార్కెట్లలోనూ వీరి సంపద తగ్గిపోయింది. 2008 తర్వాత మొదటిసారి బిలియనీర్ల సంపద 2018 సంవత్సరంలో తగ్గిపోయింది.

చైనాలో మరీ ఎక్కువ
* చైనాలోని సంపన్నుల నికర విలువ డాలర్ రూపంలో చూస్తే 12.8 శాతం తగ్గిపోయింది. స్టాక్ మార్కెట్లలో క్షీణత క్షీణత, స్థానిక కరెన్సీ బలహీనత, ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగించడం వంటి అంశాలు సంపన్నులను దెబ్బతీశాయి.
* సంపద తగ్గినప్పటికీ ప్రతి రెండు, రెండున్నర రోజులకు ఒక కొత్త బిలియనీర్ చైనాలో పుట్టుకు వస్తున్నాడు.
* అమెరికాలో తప్ప ప్రపంచంలోని ప్రతి చోట కూడా బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అమెరికా టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్లు ఎక్కువ. కొత్త టెక్నాలజీలతో సరికొత్తగా సంపన్నులు తెరపైకి వస్తున్నారు. ఫలితంగానే అమెరికా ముందుంటోంది.
* 2018 చివరి నాటికి అమెరికాలో 749 మంది బిలియనీర్లు ఉన్నారు.
* కాగా వాణిజ్య యుద్దాల వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల సంపన్నులు ఆందోళన చెందుతున్నారు. అయితే పరిస్థితులు సద్దు మనిగితే ఈ ఏడాదిలో బిలియనీర్ల సంపద పెరగడానికి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications