Richard Branson: బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ మనందరికీ సుపరిచితమే. గత ఏడాది వర్జిన్ గెలాక్టిక్ పేరుతో మెుదట విడతగా ప్రయాణికులను విజయవంతంగా అంతరీక్షంలోకి తీసుకెళ్లి చరిత్ర సృష్టించారు. అయితే తాజాగా ఆయనకు చెందిన ఉపగ్రహ ప్రయోగ సంస్థ వర్జిన్ ఆర్బిట్ దివాళాకు దాఖలు చేసింది.
జనవరిలో రాకెట్ ప్రయోగం విఫలమైన తర్వాత దాని నుంచి కోలుకోవటానికి అవసరమైన దీర్ఘకాలిక నిధులను సమకూర్చుకోవటంలో కంపెనీ విఫలమైంది. దీంతో గతవారం సంస్థ తన వద్ద పనిచేస్తున్న మెుత్తం 750 మంది ఉద్యోగుల్లో 85 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా కంపెనీ తన ఆస్తులను విక్రయించాలని కోరుతున్నట్లు యూఎస్ దివాలా కోర్టును ఆశ్రయించింది. ఆస్తుల విక్రయాన్ని ఖరారు చేయడమే ఉత్తమమైన మార్గమని వర్జిన్ ఆర్బిట్ సీఈవో డాన్ హార్ట్ అభిప్రాయపడ్డారు.

జనవరిలో రాకెట్ ప్రయోగ వైఫల్యం తర్వాత వర్జిన్ ఆర్బిట్ కష్టాలు మొదలయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన మొదటి మిషన్ లాంచర్ వన్ రాకెట్ కక్ష్యను చేరుకోవడంలో విఫలమైంది. ఈ క్రమంలో అమెరికా, యూకేలకు చెందిన ఇంటెలిజెన్స్ ఉపగ్రహాలు సముద్రంలో పడిపోయాయి. దీంతో కంపెనీ నిర్వహించిన ఆరవ మిషన్ విఫలమైంది. ఆ తర్వాత రాకెట్ డిజైన్ మెరుగుదలపై దృష్టి సారించటానికి అవసరమైన నిధులను సమీకరించుకోలేక పోయింది. ఈ కారణంగా వర్జిన్ ఆర్బిట్ మార్చి 15న తన కార్యకలాపాలను నిలిపివేయవలసి వచ్చింది.
టెక్సాస్‌కు చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ మాథ్యూ బ్రౌన్ గత నెలలో కంపెనీలో 200 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ చర్చలు పట్టాలెక్కకపోవటంతో కొత్త నిధులను వర్జిన్ ఆర్బిట్ పొందలేక పోయింది. అయితే గత నవంబర్ మార్చి మధ్య కాలంలో సంస్థ తన ఆస్తులను తనఖా పెట్టి వర్జిన్ గ్రూప్ నుంచి దాదాపు 50 మిలియన్లను అప్పుగా తీసుకుంది. 2021లో ఐపీవోగా మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ.. అప్పట్లో ఊహించినదాని కంటే 225 మిలియన్ డాలర్లను తక్కువగా సేకరించింది.


Click it and Unblock the Notifications