Mundra Port: అదానీ ఎప్పటిలాగానే తన భారీ వ్యాపార విస్తరణ ప్రణాళికలను కొనసాగిస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా వ్యాపార అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు తన పోర్ట్స్ వ్యాపారాన్ని సిద్ధం చేసే పనిలో గౌతమ్ అదానీ తనమునకలై ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే బిలియనీర్ గౌతమ్ అదానీ గుజరాత్‌లో దేశంలోనే అతిపెద్దదైన ముంద్రా పోర్ట్‌లోని తన ఫ్లాగ్‌షిప్ పోర్ట్‌లో ఓడలను నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. మారిటైమ్ ఇండియా విజన్ 2030లో పేర్కొన్నట్లుగా ప్రముఖ నౌకానిర్మాణ సంస్థగా అవతరించాలని భారత ఆశయాలకు అనుగుణంగా అదానీ తన వ్యాపార విస్తరణకు కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చైనా, దక్షిణ కొరియా, జపాన్‌తో సహా అగ్రశ్రేణి నౌకానిర్మాణ దేశాల్లో షిప్ యార్డ్స్ కనీసం 2028 వరకు బుక్ చేయబడ్డాయి. ఇది ప్రపంచ నౌకాదళ యజమానులు ప్రత్యామ్నాయ ఆప్షన్ల కోసం వెతకడానికి దారితీస్తోంది. సరిగ్గా దీనినే అదానీ క్యాష్ చేసుకోవటానికి తన ముంద్రా పోర్ట్ సౌకర్యాలను వినియోగించాలని చూస్తున్నారు. భారతదేశ ఆశయాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది, ఈ క్రమంలో ముంద్రా పోర్టును రూ.45,000 కోట్ల పెట్టుబడితో విస్తరించాలని ప్రణాళికలను కలిగి ఉంది. ప్రస్తుతం గ్లోబల్ షిప్ బిల్డింగ్ మార్కెట్‌లో ఇండియా కేవలం 0.05 శాతం వాటాతో 20వ స్థానంలో ఉంది. అయితే టాప్ 10కి ఎగబాకాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
అదానీ ముంద్రా పోర్ట్ విస్తరణకు ఇటీవల పర్యావరణ, తీరప్రాంత నియంత్రణ జోన్ క్లియరెన్స్ కూడా లభించింది. గ్లోబల్ షిప్పింగ్ పరిశ్రమ క్రమంగా డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గ్రీన్ షిప్‌ల వైపు మొగ్గు చూపుతున్నందున, నివేదికలో పేర్కొన్న విధంగా ఇది అదానీకి కూడా అనుకూలంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో రానున్న 30 ఏళ్లలో కొత్తగా 50,000 నౌకలు నిర్మించాల్సిన పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. ఈ భారీ డిమాండ్ అదానీ ప్లాన్ సఫలీకృతం కావటానికి దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదానీ రంగంలోకి త్వరగా ప్రవేశించడానికి విస్తీర్ణం, పర్యావరణ అనుమతులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా SEZ హోదా స్థానిక నౌకానిర్మాణ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక పన్ను, ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి అదానీకి సహాయం చేస్తుంది. ఈ సవాళ్లు స్థానిక నౌకానిర్మాణ పరిశ్రమకు ప్రతికూలతలను కలిగిస్తున్నందున చైనీస్ యార్డ్‌లతో భారతదేశం పోటీ పడలేకపోతోందని తెలుస్తోంది. ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications