ఈ అపర కుబేరుడి ‘విహార వాహనం’ ఖరీదెంతో తెలుసా?
అపర కుబేరుడు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో రెండోవాడైన.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తాజాగా అత్యంత విలాసవంతమైన యాట్(విహార నౌక)ను సొంతం చేసుకున్నారు. దీని పేరు 'ఆక్వా'. ఈ నౌక ఖరీదెంతో తెలుసా? రూ.4,600 కోట్లు!
ఇప్పటి వరకు బిల్‌గేట్స్‌కు సొంత నౌక లేదు. ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో కలిసి సముద్రంపై విహారయాత్ర చేయాలనుకుంటే ఆయన ఏదో ఒక ప్రైవేట్ యాట్‌ను అద్దెకు తీసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఓ సూపర్ యాట్‌నే ఆయన కొనుగోలు చేశారు.
ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈ విహార నౌక.. 2024 నాటికి బిల్ గేట్స్ చేతికి రానుంది. అప్పుడప్పుడు ఈ నౌక నుంచి బయటికి వెళ్లి విహారం చేయడానికి వీలుగా.. 32 అడుగుల పొడవు ఉండే రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. వీటిలో ఎక్కి సముద్రంలోకి వెళ్లవచ్చు.

ముచ్చట పడ్డారు.. కొనేశారు...
గత ఏడాది మొనాకోలో నిర్వహించిన ఓ యాట్ షోలో ఈ నౌక నమూనాను చూసిన బిల్ గేట్స్ బహు ముచ్చట పడ్డారు. పైగా అది పర్యావరణానికి ఏమాత్రం హానికారకం కాని ద్రవ హైడ్రోజన్‌తో నడుస్తుందని తెలియడంతో వెంటనే దాని తయారీకి ఆయన ఆర్డర్ ఇచ్చేశారు.

ఇంధనం.. పర్యావరణ హితం...
ఈ విహార నౌక నడవడానికి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగిస్తారు. దీనిని రెండు ట్యాంకుల్లో మైనస్ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించేటప్పుడు ఎలాంటి కర్భన ఉద్గారాలు వాతావరణంలోకి వెలువడవు. నీళ్లు బయటికి వస్తాయంతే.

ఒక్కసారి ఇంధనం నింపితే...
బిల్ గేట్స్ తయారు చేయించుకుంటోన్న విహార నౌక ‘ఆక్వా' 370 అడుగుల పొడవు ఉంటుంది. ఈ యాట్‌లో ఓనర్స్ సూట్‌తోపాటు రెండు వీఐపీ రూమ్స్, మరో నాలుగు గెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఈ నౌక వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే దాదాపు 3750 మైళ్ల దూరం వరకు ఇది ప్రయాణిస్తుంది.

ఏమేం సౌకర్యాలు ఉంటాయంటే...
ఈ విహార నౌకలో 14 మంది అతిథులు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. మొత్తం 31 మంది సిబ్బంది ఉంటారు. కసరత్తులు చేసుకోవడానికి జిమ్ ఉంటుంది. ధ్యానం, యోగాసనాల కోసం ప్రత్యేకంగా గది ఉంటుంది. అలాగే మేకప్ రూమ్, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ రూమ్ కూడా ఉంటాయి.


Click it and Unblock the Notifications