Ola News: లిస్టింగ్‌కు ముందు ఓలాకు ఎదురుదెబ్బ.. గూగుల్‌కు గుంత తవ్వబోయి..
Ola Maps: గూగుల్‌ను సవాలు చేస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన ఓలాకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటివరకు గూగుల్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న భవిష్ అగర్వాల్ అనుకోని ఈ సంఘటనతో ఒక్కసారిగా కంగు తిన్నారు. కాగా ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం కసరత్తు చేస్తున్నారు.
భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని 'ఓలా'కు 'మ్యాప్ మై ఇండియా' మాతృ సంస్థ CE ఇన్ఫో సిస్టమ్స్ లీగల్ నోటీసు పంపించింది. ఓలా ఇప్పుడు సొంత మ్యాపింగ్ సేవలను ప్రారంభించిన క్రమంలో తమ డేటాను కాపీ చేసిందని ఆరోపించింది. 2022లో ఓలా ఎలక్ట్రిక్ తన S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం నావిగేషన్ సేవలను అందించడానికి మ్యాప్ మై ఇండియా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఆ లైసెన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని లీగల్ నోటీసులో పేర్కొంది.

లైసెన్స్ పొందిన ఉత్పత్తికి సమాంతరంగా మరొకటి తయారుచేయడం, రివర్స్ ఇంజనీరింగ్ వంటి సాంకేతికతను వినియోగించడం వంటి కార్యకలాపాలకు ఓలా పాల్పడిందని మ్యాప్ మై ఇండియా ఆరోపిస్తోంది. లైసెన్స్డ్ ఉత్పత్తికి చెందిన API లేదా సంబంధిత సాఫ్ట్‌వేర్ నుంచి సోర్స్ కోడ్‌ను కాపీ చేయడానికి ప్రయత్నం చేయకుండా అగ్రిమెంట్ ప్రకారం నిషేధించబడినట్లు తెలిపింది.
అయితే ఆ ఒప్పందాన్ని కాలరాస్తూ ఓలా తమ మ్యాప్స్‌ను కాష్ చేసి, ఆ డేటాను సేవ్ చేసినట్లు మ్యాప్ మై ఇండియా వెల్లడించింది. 2021లో సంతకం చేసిన లైసెన్సింగ్ ఒప్పందాన్ని ఓలా ఉల్లంఘించిందని నోటీసులో తెలిపింది. ఢిల్లీకి చెందిన ఓలా ఎలక్ట్రిక్‌పై సివిల్ మరియు క్రిమినల్ ప్రొసీజర్స్‌కు తగిన విధంగా చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తున్నట్లు వివరించింది.
'మ్యాప్ మై ఇండియావి తప్పుడు ఆరోపణలు. అవి హానికరమైన మరియు తప్పుదారి పట్టించేవి అని నిస్సందేహంగా చెబుతున్నాం. ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార పద్ధతుల సమగ్రతకు మద్ధతుగా నిలుస్తుంది. నోటీసుకు త్వరలోనే తగిన విధంగా స్పందిస్తాము' అని ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆగస్టు 2న స్టాక్ మార్కెట్లో అరంగేట్రానికి రెడీ అవుతున్న తరుణంలో కంపెనీపై ఈ ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications