Tax Cuts: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. ఈ క్రమంలో వేతన జీవులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పన్ను పరిమితి పెంపును కూడా ప్రకటించారు. న్యూ టాక్స్ రీజిమ్ కింద వేతన జీవులు రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని శుభవార్త చెప్పారు.
భారత ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు పెద్ద రిలీఫ్ ప్రకటిస్తూ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని ప్రేరేపించాలని చూస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన ఉపసమనాన్ని వినియోగాన్ని పెంచటానికి బదులుగా తమకు ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకోవటానికి ఉపయోగించనున్నారని నివేదించబడింది.

ఆర్థిక మంత్రి తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయం కారణంగా దాదాపు రూ.లక్ష కోట్లు ఆదాయం తగ్గుతుందని అంచనా వేయబడింది. అయితే ఈ నిర్ణయం కారణంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో కేవలం 10 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర మాత్రమే ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని మోతీలాల్ ఆర్థికవేత్తలు నిఖిల్ గుప్తా, తనీషా లధా పేర్కొన్నారు. వాస్తవానికి దశాబ్ధకాలం కిందట 35 శాతంగా ఉన్న అప్పులు ప్రస్తుతం ఆదాయంలో 52 శాతానికి పెరిగిన వేళ ప్రజలు ఈ అప్పుల భారాన్ని తమపై తగ్గించుకునేందుకు పన్ను రిలీఫ్ సేవింగ్స్ ఉపయోగిస్తారని వెల్లడైంది.
ఒకవేళ వేతనజీవులు తమ డబ్బును ఖర్చు చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చినప్పటికీ.. ఆర్థిక వ్యయంలో వృద్ధి మందగించడం దానిని భర్తీ చేస్తుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తున్న మెుత్తాన్ని కేవలం 10 శాతం పెంచారు. 2021-2024 మధ్య కాలంలో భారత ప్రభుత్వం గతంలో రోడ్లు, పోర్ట్స్, రైల్వేలపై ప్రభుత్వ వ్యయం వృద్ధికి గణనీయమైన చోదక శక్తిగా నిలిచింది. గడచిన ప్రతి ఆర్థిక సంవత్సరాల్లో వీటిపై ఖర్చు చేసిన మెుత్తాన్ని 30 శాతం మేర బడ్జెట్లో పెంచటం జరిగింది.
ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం వల్ల స్పెండింగ్ పెరుగుతుందని అందరూ భావిస్తున్నప్పటికీ దానికి అనేక అవరోధాలు కూడా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఇది చూస్తుంటే భారతీయ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మందగమనాన్ని ఎదుర్కోవటానికి నిర్మలమ్మ ప్రకటించిన పన్ను రహిత ఆదాయ పరిమితి అస్త్రం అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ అందించలేదని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications