GST News: చిన్న వ్యాపారులకు పెద్ద ఉపశమనం.. జీఎస్టీ డిపార్ట్మెంట్ కొత్త నిర్ణయం..
GST Relief: దేశంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ పన్ను విధానం క్లిష్టమైన విధానాలను కలిగి ఉంది. వాస్తవానికి పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు, అరికట్టేందుకు దీనిని తీసుకురావటం జరిగింది.
జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేసే చిన్న వ్యాపారులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద ఊరటను అందిస్తోంది. ఇకపై రూ.2 కోట్ల లోపు వార్షిక టర్నోవర్ కలిగి ఉన్న చిన్న వ్యాపారులకు GSTR-9 ఫారమ్ నింపటం నుంచి మినహాయింపును అందించింది. వాస్తవానికి GSTR-9 అనేది GST వ్యవస్థలో నమోదు చేసుకున్న వ్యాపారులు ప్రతి సంవత్సరం చివరిలో పూరించవలసిన రిటర్న్ ఫారమ్. వ్యాపారి ఏడాది పొడవునా నెలవారీ లేదా త్రైమాసిక రిటర్న్‌ల ఏకీకృత వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది.

కంపోజిషన్ స్కీమ్, ఈ-కామర్స్ ఆపరేటర్లు కూడా ఈ రిటర్న్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ ఫారమ్‌లోని ప్రతి భాగంలో పూరించిన సమాచారాన్ని ముందుగా చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే తర్వాత ప్రభుత్వం వ్యాపారవేత్తలను స్వయంగా ధృవీకరించడానికి అనుమతించింది. ఇప్పుడు ఈ ఫారమ్‌ను నింపకుండా వ్యాపారులకు ప్రభుత్వం ఉపశమనం ఇచ్చింది. గడచిన ఐదేళ్ల కాలంలో జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేవారి సంఖ్య ఏకంగా 65 శాతం పెరిగింది. ఏప్రిల్ 2023 నాటికి వీరి సంఖ్య 1.13 కోట్లకు చేరుకుంది. అలాగే GST కింద నమోదు చేయబడిన యాక్టివ్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.40 కోట్లకు పెరిగింది.
మోదీ సర్కార్ జీఎస్టీ పన్ను విధానాన్ని జూలై 1, 2017లో దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో ఎక్సైజ్ సుంకం, సర్వీస్ టాక్స్, వ్యాట్ వంటి డజనుకు పైగా స్థానిక పన్నులు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును వరుసగా ఆరుసార్లు అధిగమించాయి. డిసెంబర్ 17, 2023 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రూ.6.95 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూలు అవుతుందని ఆదాయపు పన్ను శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ అంచనాలో 75 శాతానికి చేరాయి.


Click it and Unblock the Notifications