RBI కొత్త మార్గదర్శకాలు... ఇప్పుడు బంగారం & వెండి మీద రుణాలు మరింత సులభం
ఇప్పటివరకు బంగారం అంటే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు... గోల్డ్ లోన్ అంటే ఎక్కువగా జువెలర్ల కు వచ్చేది. కానీ ఇకపై కథ మారబోతోంది! అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్న ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు రుణాలపై మంచి ఊరటనిస్తాయి. ముఖ్యంగా బంగారం, వెండి ఆధారంగా రుణం తీసుకునే వారికి ఇవి మరింత సౌలభ్యం కలిగించబోతున్నాయి.
ఇంతవరకు బంగారం మీద రుణాలు ప్రధానంగా జువెలరీ వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యేవి. అంటే బంగారం ఉంటే దానిపై లోన్ పొందే అవకాశం ఎక్కువగా ఆభరణాల దుకాణాలకే ఉండేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ పరిధిని విస్తరించాయి. ఇకపై బంగారాన్ని ముడిసరుకుగా ఉపయోగించే తయారీ కంపెనీలు, పరిశ్రమల యూనిట్లు కూడా ఈ రుణాలకు అర్హులు కానున్నారు. ఉదాహరణకు, బంగారం ఆధారంగా ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీస్ లేదా ప్రొడక్షన్ యూనిట్లు కూడా తమ వ్యాపార అవసరాలకు ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు. అంటే, బంగారం-వెండి ఇక కేవలం ఆభరణాల దుకాణాలకే మూలధనంగా కాకుండా, ఫ్యాక్టరీలు, ప్రొడక్షన్ సెంటర్లకు కూడా ఒక ఫైనాన్షియల్ రిసోర్స్ గా మారబోతుంది.

ఇంకో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇంతవరకు బంగారం-వెండి రుణాలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులే ఇవ్వగలిగేవి. కానీ ఇప్పుడు టియర్ 3, టియర్ 4 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా ఈ రుణాలను మంజూరు చేయడానికి అనుమతి పొందాయి. దీని వల్ల పెద్ద పట్టణాలు, నగరాలకే కాకుండా చిన్న పట్టణాలు, ప్రాంతీయ వ్యాపారాలు కూడా ఈ రుణ సౌకర్యాన్ని పొందగలుగుతాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు, MSMEs వంటి వారు తమ అవసరాలకు సులభంగా బంగారం-వెండి రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఇక ఫ్లోటింగ్ రేట్ రుణాల విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు మూడు సంవత్సరాలు పూర్తయ్యేలోపే వడ్డీ రేటు తగ్గించడానికి వీలుగా ఉండబోతున్నాయి. అంటే, ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీ రేటులు ముందుగా తగ్గినట్లయితే, వినియోగదారులు కొంత లాభం పొందగలరు. అలాగే, EMI పద్ధతిలో తీసుకున్న పర్సనల్ లోన్లలో, ఫిక్స్‌డ్ రేట్‌కి మారాలా లేదా అన్న అంశం ఇప్పుడు బ్యాంకుల విచక్షణలో ఉంటుంది. అంటే, ఈ ఆప్షన్ వినియోగదారుడి చేతిలో ఉండదు, బ్యాంక్ అవసరమని భావిస్తే మాత్రమే ఫిక్స్‌డ్ రేట్‌కు మార్పు అవకాశం ఇవ్వబడుతుంది. ఈ మార్పుల ద్వారా వడ్డీ రేటులు తగ్గే అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఫిక్స్‌డ్ రేట్ ఆప్షన్ పూర్తిగా ఖాయం కాదు అని గుర్తుంచుకోవాలి.
కొన్ని ఇతర ముఖ్యమైన మార్పులు కూడా రాబోతున్నాయి. ఉదాహరణకు, గోల్డ్ మెటల్ రుణాలు GML లో జువెలర్లకు రుణం తిరిగి చెల్లించడానికి ఉన్న గడువు ఇప్పటివరకు 180 రోజులు మాత్రమే ఉండేది, కానీ కొత్త నియమాల ప్రకారం ఈ గడువు 270 రోజులుకి పెరుగుతోంది. ఇది జువెలర్లకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో కొంత ఊరట కలిగిస్తుంది. అలాగే, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్లో కూడా మార్పు ఉంది. రుణాల డేటాను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు నెలకి ఒకసారి కాకుండా వారానికి ఒకసారి సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుల క్రెడిట్ రికార్డులు మరింత సులభంగా అప్‌డేట్ అవుతాయి.


Click it and Unblock the Notifications