IT News: ఇన్ఫోసిస్‌పై కర్ణాటక అసెంబ్లీలో రచ్చ.. భారీ చర్యలకు సిద్ధరామయ్య సర్కారు సిద్ధం
Infosys News: దేశీయ సాంకేతిక రంగం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన టెక్ దిగ్గజాల్లో ఇన్పోసిస్ ఒకటి. అంతర్జాతీయంగా ఏర్పడిన మందగమన పరిస్థితులు IT రంగానికి తలనొప్పిగా తయారయ్యాయి. దీంతో ఆయా సంస్థలు ఉన్న సిబ్బందిని వదిలించుకునే పనిలో ఉన్నాయి. ఈ సమయంలో కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి దాదాపు పూర్తిగా దూరమయ్యాయి. ఇదే ఇప్పుడు ఇన్ఫోసిస్ కొంపముంచింది.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై కర్ణాటక అసెంబ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హుబ్లీ క్యాంపస్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ తీసుకోవడంలో విపలమైందంటూ విమర్శలు ఎదుర్కొంటోంది. ఉపాధి కల్పన ప్రాతిపదికన ఇన్ఫోసిస్‌కు కేటాయించిన 58 ఎకరాల భూమిని రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పారిశ్రామిక సంస్థలలో స్థానికులకు ఉపాధి అవకాశాలపై చర్చ సందర్భంగా ఈ దుమారం చెలరేగింది. 'నా నియోజకవర్గంలోని పారిశ్రామిక ఎస్టేట్‌లో ఇన్ఫోసిస్ 58 ఎకరాలు తీసుకుంది. కానీ ఒక్క ఉద్యోగాన్ని కూడా సృష్టించలేదు. కేవలం అక్కడ తోటపని చేస్తూ కూర్చుంది' అంటూ హుబ్లీ-ధార్వాడ్ (పశ్చిమ) ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్వింద్ బెల్లాడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇన్ఫోసిస్‌కు ఎకరాకు 35 లక్షల రాయితీపై భూమి లభించిందని, దాని వాస్తవ విలువ 1.5 కోట్లని పేర్కొన్నారు. వారి పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని రైతులకు హామీ ఇచ్చి ఆ కంపెనీకి భూములు కేటాయించామన్నారు. కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని రైతులను తాను ఒప్పించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యానికిగాను సంస్థపై పెనాల్టీ విధించాలని పట్టుపట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫోసిస్‌కు ఇస్తున్న ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవచ్చని IT-BT మంత్రి ప్రియాంక్ ఖర్గే సమాధానం ఇచ్చారు. సంస్థతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దొడ్డబల్లాపూర్‌లోని తైవాన్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో భూములను వదులుకునే వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి MB పాటిల్ హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications