ఏబీజీ షిప్ యార్డ్ కేసులో బ్యాంకు అధికారుల సహకారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడా కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తున్న తీరు ఆందోళన కలిగించడమే కాకుండా, అనుమానాలకు కారణంగా మారుతోంది. సహజంగా చిన్న ఇంటి రుణాలు కావాలంటేనే వంద రకాల వెరిఫికేషన్ చేసే బ్యాంకులు మోసాలకు పాల్పడుతున్నఈ సంస్థలకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నాయి అన్నది అందరి ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పటివరకు చాలా బ్యాం కులను ఫ్రాడ్ చేసిన కేసులలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉండటంతో, ప్రస్తుతం ఏబీజీ షిప్ యార్డ్ కేసులో బ్యాంకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

28 బ్యాంకుల నుండి క్రెడిట్ సౌకర్యాలు పొందిన ఏబీజీ షిప్ యార్డ్
లిక్విడేషన్‌లో ఉన్న కంపెనీ ఏబీజీ షిప్‌యార్డ్‌కు సంబంధించిన ఈ వ్యవహారంలో దాని సి.ఎం.డి రిషి కమలేష్ అగర్వాల్‌తో పాటు బ్యాంకుల కన్సార్టియంను రూ. 22,000 కోట్లకు పైగా మోసం చేసినందుకు కేసు నమోదు చేయబడింది. ఈ కేసు నవంబర్ 2019 నుండి దర్యాప్తు చేయబడుతోంది, అయితే సి.బి.ఐ ఇప్పుడు కంపెనీ మరియు దాని డైరెక్టర్లపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసింది. భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ మోసంగా పేర్కొన్న, కంపెనీకి 28 బ్యాంకుల నుండి క్రెడిట్ సౌకర్యాలు మంజూరు చేయబడ్డాయి.

నిధుల మళ్లింపు, దుర్వినియోగం నేరాలపై కేసు నమోదు
2012-17 కాలానికి సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో డైరెక్టర్లు నిధుల మళ్లింపు, దుర్వినియోగం మరియు నేరపూరిత విశ్వాస ఉల్లంఘన వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని తేలింది. ఇది అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్ కావడంతో, ఏబీజి షిప్‌యార్డ్ దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే భారతదేశం ఒక రోజులో 229 బ్యాంక్ మోసాలను చూస్తోందని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

బ్యాంకుల మోసాలలో 2021 సంవత్సరంలో రూ. 1.38 లక్షల కోట్లు స్వాహా
దేశంలో బ్యాంక్ మోసాలకు సంబంధించి 2021 ఆర్థిక సంవత్సరంలో 83,638 క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. ఒక సంవత్సరంలో రూ. 1.38 లక్షల కోట్లు స్వాహా అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. లక్షల కోట్లలో బ్యాంకులకు టోకరా వేస్తున్న కేటుగాళ్ల నుండి 2021 సంవత్సరం లో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే రికవరీ అయింది.

గతంలో బ్యాంకుల మోసాల కేసుల్లో బ్యాంకుల పాత్ర
బ్యాంకు మోసాల కేసులను అధ్యయనం చేస్తే, రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, గౌరవప్రదమైన వ్యాపారాలుగా అనిపించే వాటిని నడపడానికి రుణాలు తీసుకునే వారు అతిపెద్ద మోసాలకు పాల్పడుతున్నారు. రెండవది, బ్యాంకు అధికారుల సహకారంతోనే మోసాలు సాధ్యం అవుతున్నాయి. భూషణ్ స్టీల్ కేసులో, ప్రమోటర్ మరియు ఎండి నీరజ్ సింఘాల్ రూ. 2,000 కోట్లను స్వాహా చేసినందుకు అరెస్టు చేయబడినప్పుడు, ఎస్బిఐ, యూ సి ఓ బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల బ్యాంక్ అధికారులపై దృష్టి సారించింది.

నీరవ్ మోడీ కేసులోనూ బ్యాంకుల సహకారం .. ఏబీజీ కేసులో?
వజ్రాల దిగుమతుల కోసం రూ. 10,000 కోట్లకు పైగా నిధులు స్వాహా చేసిన నీరవ్ మోదీ కేసులో, ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్ శాఖ అధికారులు ఈ నేరానికి సహకరించారు. ఏబీజీ షిప్‌యార్డ్ కేసులో, ఇలాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. 2016 నాటికే హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నది ఈ కేసులో ప్రధానమైన ప్రశ్న. కాగా ఈ కేసులో బ్యాంకుల పాత్ర ఉందా అనేది భవిష్యత్తు విచారణలో తేలనుంది.


Click it and Unblock the Notifications