Zomato New business: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌గా జొమాటో అందరికీ సుపరిచితమే. ఫుడ్ డెలివరీతో మొదలుపెట్టి వేగంగా ఇతర విభాగాలకు సైతం తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే కిరాణా సరుకుల డెలివరీ ప్రారంభించి మంచి జోరుమీదుంది. తాజాగా మరో సర్వీసు అందించేందుకు సిద్ధమైంది. దీనిపై కంపెనీ CEO కీలక ప్రకటన చేశారు.
సినిమాలు, ఈవెంట్‌లతో పాటు డైనింగ్‌ను ఏకీకృతం చేసేందుకుగాను 'గోయింగ్-అవుట్' వ్యాపారంలోకి జొమాటో ప్రవేశించింది. ఈ మేరకు ఓ కొత్త యాప్ 'డిస్ట్రిక్ట్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా ఒకే ప్లాట్‌ఫారమ్‌లో విస్తృత శ్రేణి సేవలు అందించేందుకు జొమాటో రెడీ అయింది. దీనితో ప్రస్తుతం ఇండియాలో 60 శాతం మార్కెట్ షేర్ కలిగిన ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ బుకింగ్ సంస్థ 'బుక్ మై షో'ని సవాలు చేస్తోంది.

జొమాటో మరియు బ్లింకిట్‌లు మా పెద్ద వినియోగదారుల ఆధారిత వ్యాపారాలు. కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఇంటివద్దకే సేవలను అందిస్తున్నాయి. అలాగే బయటకు వెళ్లి భోజనం చేయాలనుకునే వినియోగదారులకు రెస్టారెంట్‌లను కనుగొనడంలో సహాయపడే 'డైనింగ్-అవుట్' వ్యాపారంలోకి కూడా ప్రవేశించాం' అని కంపెనీ వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్ తెలిపారు.
'ఈ డైనింగ్-అవుట్ బిజినెస్ ఆధారంగా గోయింగ్-అవుట్ ఆఫర్‌ను మరింత విస్తరించడానికి అవకాశం ఉందని విశ్వసిస్తున్నాము. అందుకే బయటికి వెళ్లే చోట కస్టమర్‌ల కోసం అదనంగా సినిమాలు, స్పోర్ట్స్ టికెటింగ్, లైవ్ పెర్ఫార్మెన్స్, షాపింగ్ వంటి సేవలను ఇప్పటికే ప్రారంభించాం. మరికొన్నింటిని వాటికి జతచేసే పనిలో ఉన్నాం. బయటకు వెళ్లే క్రమంలో వన్-స్టాప్ డెస్టినేషన్‌గా యాప్‌ను రూపొందించాం. ప్రతి వినియోగ సందర్భంలోనూ 'డిస్ట్రిక్ట్'ను గేమ్-ఛేంజర్‌గా మారుస్తున్నాం. జోమాటో నుంచి అందుబాటులోకి వస్తున్న మూడవ అతిపెద్ద B2C వ్యాపారం ఇదే అవుతుంది' అని గోయల్ వివరించారు.


Click it and Unblock the Notifications