ట్రంప్ హెచ్1బీ వీసా నిషేధం, జోబిడెన్ కీలక నిర్ణయం!
హెచ్1బీ వీసా జారీ ప్రక్రియకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులు పరిశీలించి లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నట్లు యూఎస్ సీఐఎస్ తెలిపింది. అమెరికా కంపెనీల్లో పని చేయాలంటేన విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసా తప్పనిసరి. భారత్, చైనా సహా వివిధ దేశాల నుండి డిమాండ్ ఉంది.
ఇదిలా ఉండగా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీసుకు వచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షులు జోబిడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధ కాల వ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీనిని పొడిగించకూడదని బిడెన్ భావించారు. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్ వంటి కంపెనీల అధిపతులు కూడా ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయమై శ్వేతసౌధం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని కొంతమంది భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బిడెన్ రద్దు చేశారు. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బిడెన్ చెబుతున్నారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి.


Click it and Unblock the Notifications