టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో సమాచార భద్రతకు ప్రాముఖ్యత ఏర్పడింది. చైనా వంటి వివిధ దేశాలు డేటా దొంగిలించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా పౌరుల ఆర్థిక లావాదేవీలతో పాటు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో పలు యాప్ లను సైతం భారత ప్రభుత్వం నిషేధించింది. తాజాగా 'భారత్ పే'కు చెందిన 150 మిలియన్ల వినియోగదారుల సమాచారం చోరీ జరిగినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ వాదనలను భారత్ పే తోసిపుచ్చింది.

అతిపెద్ద సమాచార దోపిడీ
ఫిన్ టెక్ ప్లాట్ ఫాం 'భారత్ పే' కు సంబంధించిన 150 మిలియన్ యూజర్ల డేటా దొంగిలించబడిందని.. ఆ కంపెనీ పూర్వ MD మరియు సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ ఆరోపించారు. భారత్ లో జరిగిన అతిపెద్ద సమాచార దోపిడీగా దీన్ని అభివర్ణించారు.
ప్రస్తుత CEO భావిక్ కొలాడియా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ NPCIకి లేఖ రాశారు. యెస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ICICI బ్యాంకుల APIలను ఉపయోగించి.. భారత్ పే ద్వారా వినియోగదారుల ట్రాన్సాక్షన్ డేటాను పొందారని గ్రోవర్ తెలిపారు.

ఆయన మోసగాడు
"భారత్ పేలో కొలాడియాకి అవకాశం ఇవ్వడం ఘోరమైన తప్పు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ఇప్పటివరకు ఇండియాలో జరగని అతిపెద్ద డేటా చౌర్యానికి పాల్పడ్డారు. గతంలో క్రెడిట్ కార్డ్ మోసాలు చేసినందుకుగానూ USలో దోషిగా నిర్ధారించబడ్డారు. 18 నెలల పాటు గృహనిర్బంధంలో ఉన్నారు.
అనంతరం అమెరికాలో బహిష్కరణకు గురై భారత్ కు తిరిగివచ్చారు. ఇండియాలోనూ నకిలీ టిక్కెట్ పై గుజరాత్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్ సైతం నమోదైంది. ఈ నేరారోపణలు, ఎఫ్‌ఐఆర్ కాపీకి సంబంధించిన పత్రాలను నేను జతచేశాను" అని గ్రోవర్ తన మెయిల్ లో పేర్కొన్నారు.

అంతా అబద్ధం
గ్రోవర్ వాదనపై భారత్ పే స్పందించింది. ఆయన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూరితమైనవిగా పేర్కొంది. "భారత్ పే తన వినియోగదారుల సమాచారాన్ని పరిరక్షిస్తోంది. ఇందుకోసం అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది. OTPless మా సర్వీస్ ప్రొవైడర్.
ఆ సంస్థ వాట్సాప్ ద్వారా ధృవీకరణ జరుపుతోంది. ఈ విధానాన్ని వినియోగిస్తున్న వారు మా వ్యాపార బేస్ లో 10 శాతం కంటే తక్కువే. సమాచార గోప్యతకు పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం" అని భారత్ పే వెల్లడించింది.


Click it and Unblock the Notifications