New BH series: రాష్ట్రం మారినా రీ-రిజిస్ట్రేషన్ లేదు.. కేంద్రం గుడ్‌న్యూస్
వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. దీనికి మోడీ ప్రభుత్వం ముగింపు పలికింది. ఇది ఎంతోమంది ఉద్యోగులకు భారీ ఊరట కల్పిస్తుంది. ఉద్యోగ రీత్యా ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు తమ పర్సనల్ వెహికిల్‌కు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా BH(భారత్ రిజిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను తీసుకు వచ్చింది. ఈ విధానం వల్ల రాష్ట్రాలు మారినప్పుడు రీ-రిజిస్ట్రేషన్ చేసే అవసరం ఉండదు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రయివేటు కంపెనీలు/సంస్థల ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చును. అయితే ప్రయివేటు కంపెనీలు లేదా సంస్థల ఉద్యోగులు అయితే తమ కంపెనీ నాలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తూ ఉండాలి. ఈ కొత్త BH రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రానికి అయినా ఈజీగా వెళ్లే వెసులుబాటు ఉంటుంది.

ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన పర్సనల్ వెహికిల్‌ను గరిష్ఠంగా ఏడాది మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వెహికిల్ నడపాలంటే వాహనాన్ని ఆ గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాలి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కేంద్రం BH సిరీస్‌ను తీసుకు రావడం భారీ ఊరట.


Click it and Unblock the Notifications