వైరల్ వీడియో ఎఫెక్ట్: బెంగళూరు ఫుట్‌పాత్‌లపై అధికారుల మెరుపు చర్యలు.. నెటిజన్లు ఫిదా!
టెక్ సిటీ బెంగళూరు(Bengaluru)లో నడవాలంటే పాదచారులకు ఒక సాహసయాత్రలా ఉండేది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఇందిరానగర్ వంటి చోట్ల కూడా ఫుట్‌పాత్‌ల పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే ఈ సమస్యను ప్రపంచానికి చాటిచెప్పిన ఒక కెనడియన్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంత రూపురేఖలను మార్చేశారు.

ఏమిటా వైరల్ వీడియో కథ?
కెనడాకు చెందిన కేలెబ్ ఫ్రైసెన్ (Caleb Friesen) కొద్ది రోజుల క్రితం ఇందిరానగర్ డబుల్ రోడ్డుపై ఒక వీడియో తీశారు. అందులో తన చిన్నారి కొడుకుతో కలిసి నడవడానికి ఆయన పడ్డ ఇబ్బందులను చూపించారు. విరిగిపోయిన డ్రైనేజీ మూతలు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించిన మొక్కల కుండీలు, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లు, ఆఖరికి ఫుట్‌పాత్‌పై పార్క్ చేసిన వాహనాలు.. ఇలా ప్రతి అడుగులోనూ అడ్డంకులే కనిపించాయి. "నగరం ఎంత టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. కనీసం నడవడానికి దారి లేకపోతే ఎలా?" అని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. అతని ప్రశ్న చాలామంది నెటిజన్లను ఆలోచింపజేసింది.
అధికారుల మెరుపు చర్యలు
ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ (BCCC), గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) వేగంగా స్పందించాయి. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, ఇందిరానగర్ డబుల్ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేసి, ఆక్రమణలను తొలగించారు. డ్రైనేజీపై కొత్త మూతలు వేసి, పాదచారులు సురక్షితంగా నడిచేలా మార్గాన్ని సిద్ధం చేశారు.
దీనిపై కేలెబ్ స్పందిస్తూ.. "హోల్స్ కవర్ అయ్యాయి! ఆక్రమణలు తొలగిపోయాయి! బెంగళూరు(Bengaluru) ఇప్పుడు మెల్లమెల్లగా 'వాకలూరు(Walkaluru)'గా మారుతోంది" అంటూ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియో పోస్ట్ చేశారు.
నెటిజన్ల ప్రశంసలు
కేలెబ్ చేసిన ఈ ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "మా విన్నపాలు వినని అధికారులు, మీ ఒక్క వీడియోతో దిగివచ్చారు. మీరు బెంగళూరు అంతా ఒకసారి చుట్టి రావాలి" అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు తమ నగరాలకు కూడా వచ్చి ఇలాంటి మౌలిక సదుపాయాల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
గతంలో సెప్టెంబర్ నెలలో మెజెస్టిక్ ఏరియాలో కూడా కేలెబ్ ఇలాంటి సమస్యలను ఎత్తిచూపగా అధికారులు స్పందించడం గమనార్హం. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు, సోషల్ మీడియా ద్వారా పౌర సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పే ఒక గొప్ప ఉదాహరణ.
మార్పు మొదలైంది!
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఎదురైనప్పుడు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితుల్లో ఇలాంటి వైరల్ వీడియోలు అధికారులను బాధ్యతాయుతంగా మార్చుతున్నాయి. బెంగళూరు(Bengaluru) వంటి మెట్రో నగరాల్లో కేవలం ఐటీ భవనాలు మాత్రమే కాదు, సామాన్యుడు నడిచే దారులు కూడా బాగుండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 'వాకలూరు' స్ఫూర్తి అన్ని నగరాలకు విస్తరించాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications