బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రోజూ వేలాది వాహనాలు కిక్కిరిసి పోతాయి. ఐటీ కంపెనీలు, టెక్ పార్క్‌లు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళడం, తిరిగి రావడం చాలా కష్టతరంగా మారింది. ఈ సమస్యను కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక ఆసక్తికరమైన ఆలోచనను ముందుకు తీసుకువచ్చారు.
సెప్టెంబర్ 19న విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి లేఖ ఆయన రాశారు. ఆ లేఖలో విప్రో సర్జాపూర్ క్యాంపస్ గుండా వాహనాల రాకపోకకు పరిమిత అనుమతి ఇస్తే ఔటర్ రింగ్ రోడ్‌పై కనీసం ముప్పై శాతం వరకు రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఆఫీస్ సమయాల్లో ఇది ప్రయాణికులకు చాలా ఉపశమనం కలిగిస్తుందని సీఎం వివరించారు. అంతేకాకుండా, ఈ కీలకమైన చర్య నగరంలో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని.. బెంగళూరును మరింత నివాసయోగ్యంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే అజీమ్ ప్రేమ్‌జీ ఈ అభ్యర్థనకు వినయపూర్వకంగా నిరాకరణ తెలిపారు. విప్రో సర్జాపూర్ క్యాంపస్ ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా గుర్తించబడిన ప్రైవేట్ ఆస్తి అని, ఇది ప్రజా రవాణా కోసం ఉద్దేశించి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంగణం లిస్టెడ్ కంపెనీకి చెందినదని.. దానిని ప్రజా రోడ్డు లాగా ఉపయోగించడం వల్ల అనేక చట్టపరమైన, పాలనాపరమైన, భద్రతా సమస్యలు తలెత్తుతాయని ప్రేమ్‌జీ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రేమ్‌జీ అభిప్రాయం ప్రకారం.. ప్రైవేట్ క్యాంపస్ రోడ్లను ప్రజా రవాణా కోసం వాడటం స్థిరమైన పరిష్కారం కాదు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య చాలా క్లిష్టమైనది. ఒక్క పరిష్కారంతో అది పూర్తిగా సర్దుబాటు కావడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే Bengaluru Traffic సమస్యను పరిష్కరించడంలో విప్రో వెనుకడుగు వేయబోదని హామీ ఇచ్చారు. నగర ట్రాఫిక్ సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఒక ప్రపంచస్థాయి నిపుణుల బృందాన్ని నియమించడం అవసరమని ఆయన సూచించారు.
అలా చేస్తే చిన్నకాల, మధ్యకాల, దీర్ఘకాలంలో అమలు చేయగల సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం అవుతుందని అన్నారు. ఈ అధ్యయనానికి కావాల్సిన ఖర్చులో గణనీయమైన భాగాన్ని విప్రో భరించడానికి కూడా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వాహనాల రద్దీతో పాటు రహదారి పరిస్థితి కూడా దారుణంగా ఉండటం వల్ల అక్కడ ప్రయాణం ఒక పీడకలలా మారింది. ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణికుల సమయం వృథా అవుతోంది, అలాగే ఉద్యోగుల ఉత్పాదకత కూడా దెబ్బతింటోంది.


Click it and Unblock the Notifications