IT News: బెంగళూరులో పనిచేస్తున్న టెక్కీలకు కీలక అప్‌డేట్..!
Bengaluru Techies: భారతీయ సిలికాన్ వ్యాలీగా బెంగళూరు పేరుగాంచింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమ వేగంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరులో స్టార్టప్ కంపెనీలు, ఐటీ సేవల కంపెనీలు భారీ సంఖ్యలో ఉండటంతో ఉద్యోగులు అధిక సాంద్రతలో నగరంలో ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సైతం వేల మంది బెంగళూరులో పనిచేస్తున్నారు.
చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసేసి తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని నిర్థేశించిన తర్వాత బెంగళూరు రోడ్లపై రద్దీని భారీగా పెంచేసింది. కొన్ని సార్లు ట్రాఫిక్ జామ్స్ కారణంగా గంటల తరబడి ప్రజలు రోట్లపైనే ఇరుక్కుంటున్నారు. ఈ సమస్య పరిష్కరించి రద్దీని నివారించటానికి కర్ణాటక ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసులు మరో మంచి ఐడియాతో ముందుకొచ్చారు. ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా ఐటీ ఉద్యోగులు వారానికి ఒక్కసారైనా ప్రజా రవాణాను వినియోగించాలని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కోరారు.

నగరంలోని ప్రజలు సొంత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థలను విరివిగా వినియోగించటం ద్వారా కర్భన ఉద్ఘారాలు తగ్గటంతో పాటు పొల్యూషన్ సైతం తగ్గుతుందని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు. బెంగళూరు మహానగరంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మంది ప్రజా రవాణాకు మారటం వద్ద రోడ్లపై రద్దీ 20 శాతం వరకు తగ్గుతుందని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు క్యాబ్ సర్వీస్ అందించటం ద్వారా రద్దీ సమయాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇలాంటి పరిస్థితులను నివారించటానికి.. ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కెఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌ల వద్ద పోలీసులు ప్రజా రవాణాను ఉపయోగించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించటంతో పాటు ప్రాముఖ్యతను వెల్లడించటంతో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగిస్తామని చాలా మంది హామీ ఇచ్చారు. తక్కువ దూరాలకు నడక లేదా సైకిల్స్ వాడాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వ రవాణా వ్యవస్థలోని బస్సులు, మెట్రో వంటివి వినియోగించటం ద్వారా బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గటంతో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుందని కర్ణాటక పోలీసు కమిషనర్ దయానంద అన్నారు. అధిక సంఖ్యలో సొంత వాహనాలను ప్రిఫర్ చేయటం వల్ల నగరంలో వాయుకాలుష్యం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం బెంగళూరులో అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా ట్రాఫిక్‌ను పర్యవేక్షించడంతోపాటు అపార్ట్‌మెంట్లకు ముందుగానే లైవ్ ట్రాఫిక్ అలర్ట్‌లు ఇవ్వటం ప్రారంభిస్తున్నారు. ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులు సైతం సమస్య పరిష్కారానికి కలిసి రావాలని ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications