Bengaluru: బెంగళూరు-గోవా వందేభారత్‌కు గ్రీన్ సిగ్నల్! టైమింగ్స్, రూట్ మ్యాప్ ఇవే!
సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) నుంచి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్లే పర్యాటకులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. అతి త్వరలోనే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SWR) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం 13 గంటల్లోనే మీరు బెంగళూరు నుంచి గోవా చేరుకోవచ్చు.

ప్రతిపాదిత రూట్.. టైమింగ్స్..
తాజా సమాచారం ప్రకారం.. ఈ వందే భారత్ రైలు బెంగళూరులోని యశ్వంత్‌పూర్ స్టేషన్ నుంచి బయలుదేరి గోవాలోని మడ్గావ్ వరకు ప్రయాణిస్తుంది.
- యశ్వంత్‌పూర్ (Bengaluru): ఉదయం 6:05 గంటలకు బయలుదేరి, రాత్రి 7:15 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది.
- మడ్గావ్ (Goa): తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:40 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
ఈ ప్రయాణం మంగళూరు రైల్వే రీజియన్ మీదుగా సాగుతుంది. ముఖ్యంగా పాడిల్ బైపాస్ ద్వారా వెళ్లడం వల్ల మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ స్టేషన్లను ఈ రైలు స్కిప్ చేస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
సాంకేతిక మెరుగులు
ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు చిక్కా బనవార, హసన్ మధ్య రైలు వేగాన్ని గంటకు 110 కిలోమీటర్ల నుండి 130 కిలోమీటర్లకు పెంచాలని రైల్వే బోర్డుకు ప్రతిపాదించారు. అంతేకాకుండా అత్యంత క్లిష్టమైన సకలేష్‌పూర్ - సుబ్రమణ్య రోడ్ ఘాట్ సెక్షన్‌లో వేగాన్ని 30 కిమీ నుండి 40 కిమీకి పెంచే అవకాశం ఉంది. ఈ మార్గంలో ప్రయాణం పశ్చిమ కనుమల మీదుగా సాగుతుంది. కాబట్టి ప్రయాణికులకు ప్రకృతి అందాలను చూసే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.
ట్రయల్ రన్స్ .. ఏఈబీ సిస్టమ్..
ఈ మార్గంలో రైలును ప్రారంభించే ముందు ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ఘాట్ సెక్షన్లలో భద్రత కోసం ఈ వందే భారత్ రైళ్లకు ప్రత్యేకంగా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (Automatic Emergency Braking) (AEB) సిస్టమ్ ను అమర్చనున్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో రైలును సురక్షితంగా ఆపడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం హసన్ - తోకూరు సెక్షన్ లో విద్యుదీకరణ పనులు పూర్తికావాల్సి ఉంది. అవి పూర్తయిన వెంటనే ట్రయల్ రన్స్ మొదలవుతాయి.
పర్యాటక రంగానికి ఊతం
బెంగళూరు నుంచి గోవాకు వెళ్లేందుకు ప్రస్తుతం బస్సులు లేదా సాధారణ రైళ్లపై ఆధారపడాల్సి వస్తోంది. పండుగ సీజన్లలో, వీకెండ్స్ లో బస్సు టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. వందే భారత్ అందుబాటులోకి వస్తే.. తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా , సరసమైన ధరలో గోవా చేరుకోవచ్చు. ఇది కర్ణాటక , గోవా రాష్ట్రాల మధ్య పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. రైల్వే బోర్డు నుంచి తుది అనుమతి లభించిన వెంటనే అధికారిక షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications