బెంగుళూరు ట్రాఫిక్..బుధవారం రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలని కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు సూచన
దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ శాఖ అధికారులు కొత్త పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు. తాజాగా టర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని ఐటీ కంపెనీలకు సంబంధించి అధికారులు పలు సిఫార్సులు చేశారు. బెంగళూరు మిర్రర్ తెలిపిన కథనం ప్రకారం ఉద్యోగులు రాకపోకలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందన్నారు. దీనికి పరిష్కారంగా వారం మధ్యలో వర్క్ ఫ్రమ్ హోం (WFH Wednesdays) అనే వినూత్న ఆలోచనను ముందుకు తీసుకువచ్చారు.
దీంతో పాటుగా ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అధిక రద్దీ నమోదవుతోందని గుర్తించిన అధికారులు, ఐటీ కంపెనీలు ఉదయం 7:30 నుంచే తమ కార్యాలయాలను ప్రారంభించాలన్న సూచన చేశారు. ఇది ఉదయపు ట్రాఫిక్ పీక్ గంటల్లో వాహన భారం తగ్గించడానికే కాక.. ప్రయాణ సమయంలో సమయాన్ని కూడా మించిపోవడాన్ని నివారించనుంది.ఇక ఉద్యోగులు వారంలో బుధవారం రోజు ప్రత్యేకంగా ఇంటి నుంచి పని (WFH) చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. ఇది వారాంతపు ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల రవాణా సౌకర్యార్థం షటిల్ బస్సులు అందుబాటులో ఉంచాలని సూచనలు కూడా ప్రతిపాదించారు.

ORR వెంబడి ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మూడు రోజులపాటు ట్రాఫిక్ డేటా సేకరణ కోసం పలు కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్లు రూపొందించనున్నారు.ఇక నగరంలో అక్రమ పార్కింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలోనే టెక్ పార్క్‌ల చుట్టూ, జంక్షన్ల వద్ద అక్రమంగా పార్క్ చేసిన వాహనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు.
నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే వెంటనే వాహనాలను టోయింగ్ చేయాలని అధికారులు సూచించారు. బస్సులు, ట్రక్కులు, వాటర్ ట్యాంకర్లు బ్రేక్‌డౌన్ అవ్వడం వల్ల కలిగే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రత్యేకంగా తక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు.దీనికి సంబంధించి ఈ రోజు సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ..సమావేశంలో అన్ని సంబంధిత శాఖలు కలిసి పని చేయడానికి అంగీకరించాయని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఇది మంచి ముందడుగని తెలిపారు. ఏదేమైనా బెంగళూరు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనడంలో అధికారులు వినూత్న మార్గాలను ఆవిష్కరిస్తూ, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. IT హబ్‌గా పేరుగాంచిన బెంగళూరుకు ఇది ఒక ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications