పశ్చిమ బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. ఆరెంజ్ లైన్ కారిడార్ రెడీ, తొలి డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ ఇదే
బెంగళూరు నగర రవాణా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగళూరుకు మెరుగైన కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో.. హోసహల్లి నుంచి కడబగేరె క్రాస్ వరకు 12.5 కిలోమీటర్ల పొడవైన ఆరెంజ్ లైన్ మెట్రో కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది Bengaluru నగరంలోనే తొలి డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ గా నిలవనుంది.
ప్రతిపాదిత ఆరెంజ్ లైన్‌లో వినూత్నమైన డబుల్ డెక్కర్ డిజైన్‌ను అమలు చేయనున్నారు. రోడ్డు స్థాయిలో ఫ్లైఓవర్‌ను నిర్మించి, దాని పైన మెట్రో వయాడక్ట్‌ను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్షణంగా అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణ నమూనా ద్వారా పరిమిత పట్టణ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటుగా.. రోడ్డు ట్రాఫిక్ ఒత్తిడిని కూడా గణనీయంగా తగ్గించవచ్చని BMRCL అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇది బెంగళూరులోనే ఎత్తైన మెట్రో కారిడార్‌గా గుర్తింపు పొందనుంది.

ఆరెంజ్ లైన్ కారిడార్ పశ్చిమ బెంగళూరులోని ముఖ్యమైన నివాస, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించనుంది. మొత్తం తొమ్మిది మెట్రో స్టేషన్లు ఈ మార్గంలో నిర్మించనున్నారు. అవి ఏంటంట.. హోసహల్లి, కెహెచ్‌బి కాలనీ, కామాక్షిపాల్య, సుమనహల్లి క్రాస్, సుంకడకట్టే, హీరోహల్లి, బ్యాదరహల్లి, కామత్ లేఅవుట్, కడబగేరె. ఈ కారిడార్ అమల్లోకి వస్తే ఈ ప్రాంతాల్లో నివసించే వేలాది మంది ప్రజలకు రోజువారీ ప్రయాణం మరింత సులభం, వేగవంతం కానుందని అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్ట్ అమలులో భాగంగా.. BMRCL ఇప్పటికే టెండర్ పత్రాల తయారీని పూర్తి చేసింది. రాబోయే ఆరు నెలల్లో బిడ్లను ఆహ్వానించనుండగా.. 2026 జూన్ నాటికి నిర్మాణ పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. అయితే, డబుల్ డెక్కర్ డిజైన్‌లో ఉన్న సాంకేతిక సంక్లిష్టతల కారణంగా.. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి సుమారు 5.5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సాధారణ మెట్రో కారిడార్లతో పోలిస్తే.. డబుల్ డెక్కర్ మెట్రోలకు ఎక్కువ ఖర్చు, ఎక్కువ సమయం అవసరమవుతుందని BMRCL అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా మెట్రో ప్రాజెక్టులు సంవత్సరానికి 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో పురోగమిస్తే.. డబుల్ డెక్కర్ కారిడార్లు ఇంజనీరింగ్ సవాళ్ల వల్ల సంవత్సరానికి 3 నుంచి 5 కిలోమీటర్ల వరకే ముందుకు సాగగలవని తెలిపారు.
ఈ ఆరెంజ్ లైన్ ప్రాజెక్ట్‌కు అంచనా వ్యయం రూ. 15,611 కోట్లుగా ఉంది. భారీ పెట్టుబడి అవసరమైనప్పటికీ.. దీని దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎంతో ముఖ్యమైనవిగా BMRCL భావిస్తోంది. పట్టణ స్థల వినియోగాన్ని మెరుగుపరచడం, రోడ్డు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రజా రవాణా సామర్థ్యాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు ఈ కారిడార్ ద్వారా సాధ్యమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒకసారి సేవలు అమల్లోకి వచ్చిన తర్వాత.. పశ్చిమ బెంగళూరు ప్రజల మొబిలిటీ అవసరాలను తీర్చడంలోనే కాకుండా, నమ్మ మెట్రో నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంలో కూడా ఆరెంజ్ లైన్ కీలక పాత్ర పోషించనుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా గట్టిగానే అధికారులు అడుగులు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications