బెంగళూరు ట్రాఫిక్ జామ్ కష్టాలు తీరినట్లే, బిడదిలో భారీ ఐటీ హబ్.. ఐటీ కంపెనీలన్నీ అక్కడి నుంచే ఇక..
దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు త్వరలోనే భారతదేశపు మొదటి, అతిపెద్ద కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పట్టణంగా నిలవబోతోంది. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం బిడదిలో గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ (GBIT) ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సుమారు 9 వేల ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న AI నగరాన్ని నిర్మించనుంది. వర్క్-లైవ్-ప్లే మోడల్ చుట్టూ రూపకల్పన చేసిన ఈ పట్టణం.. రాష్ట్రంలో రెండవ కేంద్ర వ్యాపార జిల్లాగా (CBD) తయారవుతుందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ఇందులో 2 వేల ఎకరాలకు పైగా భూభాగాన్ని ప్రత్యేకంగా AI ఆధారిత పరిశ్రమలు, వాటికి అనుబంధ యూనిట్ల కోసమే కేటాయించనుంది కర్ణాటక ప్రభుత్వం.
STRR, NH-209, NH-275, NICE రోడ్‌లను కలుపుతూ 300 మీటర్ల వెడల్పుతో వ్యాపార కారిడార్‌ను ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. ఇది పరిశ్రమలకు, నివాసితులకు సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించనుంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కేవలం సాంకేతిక హబ్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, Bengaluru లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కూడా అని శివకుమార్ తెలిపారు. వాక్-టు-వర్క్ ప్రణాళికలు, రింగ్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు.. ఇలా పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను బిడదికి మళ్లించడం ద్వారా నగరంపై భారాన్ని తగ్గించేదిశగా సిద్దరామయ్య ప్రభుత్వం సన్నహాలు చేస్తోందన్నారు. 1,100 ఎకరాలకుపైగా పార్కులు, బహిరంగ ప్రదేశాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అత్యంత పచ్చని నగర టౌన్‌షిప్‌లలో ఒకటిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.

రామనగర డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రైతులు, అధికారులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం శివకుమార్ మాట్లాడుతూ.. భూసేకరణలో పారదర్శకతను ప్రభుత్వం పాటిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని హామీ ఇస్తూ.. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను పునరావృతం చేయబోమని తెలిపారు. భూములను డీనోటిఫై చేసి జైలుకెళ్లే పరిస్థితి రావడానికి నేను సిద్ధంగా లేనని ఆయన తెలిపారు. రైతుల నిరసనల నేపథ్యంలో ఇప్పటికే నోటిఫై చేయబడిన భూములను చట్టబద్ధంగా విడుదల చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అయితే, అదనపు భూమిని సేకరించబోమని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్ 2006లో హెచ్‌డీ కుమారస్వామి కాలంలో ప్రతిపాదించారు. అయితే డెవలపర్లు వెనక్కి తగ్గడం, విధానపరమైన అడ్డంకులు ఉండటం వల్ల ఆలస్యమైంది. 2023లో గ్రేటర్ బెంగళూరు బిడది స్మార్ట్ సిటీ ప్లానింగ్ అథారిటీని గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు కొత్త ఊపొచ్చింది. ఫిబ్రవరి 2025లో క్యాబినెట్ GBIT ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. మార్చిలో ప్రాథమిక భూసేకరణ నోటిఫికేషన్ జారీ కావడంతో, తొమ్మిది గ్రామాల్లో విస్తరించి ఉన్న 8,493 ఎకరాలు ఇప్పుడు ప్రాజెక్ట్ పరిధిలోకి వచ్చాయి. వీటిలో 6,731 ఎకరాలు ప్రైవేట్ భూమి, 750 ఎకరాలు ప్రభుత్వ భూమి, 1,012 ఎకరాలు జల వనరులు ఉన్నాయి.
ఇప్పటివరకు భూ యజమానులలో దాదాపు 70 శాతం మంది పరిహారానికి అంగీకరించారు. ఇందులో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మిగతా 30 శాతం భూ యజమానులు ఇంకా అంగీకరించలేదు. రైతులకు న్యాయమైన పరిహారం అందించడానికి రూ. 10 వేల కోట్లు సమకూర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని శివకుమార్ తెలిపారు. ఈ పట్టణం కేవలం AI పరిశ్రమలకే కాదు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, బహుళజాతి కంపెనీలు, సాంకేతిక స్టార్టప్‌లకు కూడా కేంద్ర బిందువుగా మారనుంది. లక్షలాది ఉద్యోగాలను సృష్టించే ఈ ప్రాజెక్ట్‌లో ముందుగా స్థానికులకే అవకాశాలు అనే కాన్సెప్ట్ అమలు చేయనున్నారు. కర్ణాటక యువతను AI ఆధారిత పరిశ్రమలకు సిద్ధం చేయడానికి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు.


Click it and Unblock the Notifications