బెంగళూరులో ఓనర్ల దోపిడి.. రూ. లక్ష డిపాజిట్ కట్టించుకుని రూ. 19 వేలు తిరిగిచ్చారు..భోరుమంటున్న అద్దెదారు..
భారత సిలికాన్ సిటీ.. దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో నివాసం అంటే ఉద్యోగస్తులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ ఉద్యోగం చేసేవారు రెంటుకి ఉండాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. హౌస్ అద్దెతో పాటుగా అడ్వాన్స్ గురించి తలుచుకుంటే లబోదిబోమనే పరిస్థితి. తాజాగా బెంగళూరు నగరంలో ఇళ్ల అద్దెలకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ల రికవరీ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు ఆజ్యం పోసింది.
ఒక అద్దెదారు తన ఇంటి యజమాని లక్ష రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ నుండి ఏకంగా రూ. 80,396 కోత విధించి.. తనకు కేవలం రూ. 19,604 మాత్రమే తిరిగి ఇచ్చారని ఆవేదనతో పోస్ట్ పెట్టాడు. తాను నివసించిన కాలంలో ఇల్లు దెబ్బతిన్నందుకు కాకుండా.. ఆ తర్వాత వచ్చే కొత్త అద్దెదారు ప్రయోజనం కోసం చేసే రిపేర్లు, అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఖర్చులను కూడా తన డిపాజిట్ నుంచే మినహాయించారని సదరు అద్దెదారు వాపోయారు. r/bangalorerentals అనే రెడ్డిట్ (Reddit) సబ్‌రెడిట్‌లో ఖర్చుల వివరాల షీట్ స్క్రీన్‌షాట్‌లను పంచుకుంటూ పెట్టిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుండి వందలాది స్పందనలు వెల్లువలా వస్తున్నాయి.

బాధిత అద్దెదారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఒక 2BHK అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని.. తన అద్దె కాలమంతా ఆ ఇంటిని సొంత ఇల్లులాగే ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే ఫ్లాట్‌ను ఖాళీ చేసిన తర్వాత ఇంటి యజమాని పెయింటింగ్, పాలిషింగ్, వైరింగ్, వడ్రంగి పని (కార్పెంట్రీ), ప్లంబింగ్, ఇల్లు శుభ్రపరచడం వంటి వివిధ రకాల మరమ్మతుల పేరుతో రూ. 80,396 కోత విధించినట్లు ఒక సుదీర్ఘ జాబితాను చేతిలో పెట్టారు. ఇంత భారీ మొత్తంలో మినహాయింపులు చేసే అంత పెద్ద నష్టం అపార్ట్‌మెంట్‌కు ఎక్కడా జరగలేదని.. కాకుండా తదుపరి వచ్చే అద్దెదారు కోసం ఫ్లాట్‌ను సరికొత్తగా మార్చడానికి తన డబ్బును వాడుకుంటున్నట్లుగా ఈ చర్య ఉందని ఉద్యోగి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ బెంగళూరులో ఇళ్లను అద్దెకు తీసుకుని నివసిస్తున్న ఎంతోమందిని ఆలోచింపజేయడమే కాకుండా.. నగర అద్దె మార్కెట్‌లో ఇదొక నిత్య సమస్యగా మారిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన ఒక వినియోగదారుడు.. బెంగళూరులో పోలీసులు సహాయం చేయరనేది తప్పుడు అభిప్రాయమని.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 100కు డయల్ చేసి లేదా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు ఖచ్చితంగా ఇంటి యజమానిని పిలిపించి మాట్లాడతారని సలహా ఇచ్చారు.
మరొక వినియోగదారుడు బెంగళూరు ఇంటి యజమానుల తీరును తీవ్రంగా తప్పుబడుతూ.. ఇక్కడి ఓనర్లు అద్దెదారుల అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరని, కనీసం అందులో ఎక్కువ భాగాన్ని దోచుకోకుండా వదిలిపెట్టరని విమర్శించారు. అద్దెతో ఏమాత్రం సంబంధం లేకుండా డిపాజిట్ల పేరిట భారీ మొత్తాలను వసూలు చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమే పెద్ద ఎత్తున దోపిడీ చేయడమని ఆయన మండిపడ్డారు.
అలాగే అద్దె ఒప్పందాన్ని (Rental Agreement) కేవలం ఒక లాంఛనంగా భావించవద్దని.. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎదురయ్యే ఇలాంటి పెయింటింగ్, రిపేరింగ్ ఖర్చుల నిబంధనలను ఇల్లు తీసుకునే ప్రారంభంలోనే ఒప్పందంలో స్పష్టంగా నమోదు చేసుకోవాలని మరొక వినియోగదారుడు ప్రాక్టికల్ సూచన చేశారు.


Click it and Unblock the Notifications
