బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్.. 148 కిలోమీటర్ల సబర్బన్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక మార్పులు..
Bengaluru Suburban Rail Update: ఐటీ రాజధాని బెంగళూరులో నిత్యం వేధిస్తున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన బెంగళూరు సబర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (BSTP) పనుల్లో కీలక ముందడుగు పడింది. నగర కేంద్ర ప్రాంతాలను శివార్లలోని నివాస, పారిశ్రామిక జోన్లతో అనుసంధానించే ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైన 7.795 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్ నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్డ్ డిజైన్ కన్సల్టెన్సీ (DDC) సేవలకై 'కె-రైడ్' (K-RIDE) సంస్థ అధికారికంగా బిడ్లను ఆహ్వానించింది.
మొత్తం 148.17 కిలోమీటర్ల పొడవునా, 4 కారిడార్లు, 57 స్టేషన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ సబర్బన్ రైల్వే నెట్వర్క్, బెంగళూరు నగరవాసుల నిత్య ప్రయాణ స్వరూపాన్నే మార్చివేయనుంది. ఈ కొత్త టెండర్ పరిధిలో ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచే డబుల్ డెక్కర్ వయాడక్ట్ నిర్మాణం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒకే పిల్లర్ నిర్మాణంపై ఒక వైపు రైలు మార్గం, మరొక వైపు రోడ్డు వాహనాలు ప్రయాణించేలా ఈ వినూత్న డిజైన్‌ను రూపొందిస్తున్నారు.

ఈ ప్రణాళికలో భాగంగా మతికెరె వద్ద ప్రత్యేక డబుల్ డెక్కర్ స్టేషన్, రోడ్డు ఫ్లైఓవర్ ర్యాంపులు, వై-లూప్ (Y-Loop) ర్యాంపులను నిర్మించనున్నారు. ఈ డిజైన్ పనులు కారిడార్ 2లోని బెన్నిగనహళ్లి - యశ్వంత్‌పూర్ క్యాబిన్ మధ్య, కారిడార్ 1లోని యశ్వంత్‌పూర్ ప్రాంతం, అలాగే కారిడార్ 4 పరిధిలోని నాలుగు రోడ్ ఓవర్‌బ్రిడ్జీలు (ROB), ఒక రోడ్ అండర్‌బ్రిడ్జి (RUB) లలో విస్తరించి ఉంటాయి. వీటితో పాటు బెన్నిగనహళ్లి, హెబ్బాల్, యశ్వంత్‌పూర్ వద్ద ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలను నిర్మించి, సబర్బన్ రైలు వ్యవస్థను నగర మెట్రో నెట్వర్క్ మరియు భారతీయ రైల్వే స్టేషన్లతో నేరుగా అనుసంధానించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ లోని 4 ప్రధాన కారిడార్లు నగర నలుగు దిక్కులను కవర్ చేస్తాయి:
1. కారిడార్ 1: కేఎస్ఆర్ బెంగళూరు - దేవానహళ్లి (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానం)
2. కారిడార్ 2: బైయప్పనహళ్లి - చిక్కబాణావార
3. కారిడార్ 3: కేంగేరి - వైట్‌ఫీల్డ్ (ఐటీ కారిడార్ మార్గం)
4. కారిడార్ 4: హీలలిగె - రాజానకుంటే
ఈ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే, సుదూర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే ఉద్యోగులు, వ్యాపారులకు రోడ్డు ప్రయాణానికి బలమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయం లభిస్తుంది. అంతేకాకుండా, మెట్రో మరియు బస్సులతో సమర్థవంతమైన మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ ఏర్పడి ప్రయాణ సమయం, ఇంధన వ్యయం గణనీయంగా తగ్గుతాయి. కారిడార్ల నిర్మాణం పూర్తయి సేవలు ప్రారంభమైతే గ్రేటర్ బెంగళూరు ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం రావడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
