బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్.. నగరం చుట్టూ కొత్త రింగ్ రోడ్.. నవంబర్‌లో 144 కి.మీ STRR అందుబాటులోకి..
భారత సిలికాన్ సిటీ, ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్ భారాన్ని తగ్గించి.. పొరుగు జిల్లాలతో పాటు తమిళనాడుకు అనుసంధానాన్ని పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 288 కిలోమీటర్ల పొడవైన శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR) ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగమైన 144 కిలోమీటర్ల యాక్సెస్-నియంత్రిత కారిడార్‌ను నవంబర్ 2026 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ. 14,655 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న శాటిలైట్ టౌన్‌లు, ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) మధ్య రాకపోకలను ఎంతో సులభతరం చేయనుంది.
మొత్తం 288 కిలోమీటర్ల ఈ రింగ్ రోడ్డులో.. 243 కిలోమీటర్లు కర్ణాటకలో, మిగిలిన 45 కిలోమీటర్లు తమిళనాడులో విస్తరించి ఉంది. నాలుగు, ఆరు లేన్లుగా నిర్మిస్తున్న ఈ మార్గంలో తొలి విడతగా అందుబాటులోకి రానున్న 144 కిలోమీటర్ల కారిడార్ దొబ్బస్‌పేట్, దొడ్డబళ్లాపుర, దేవనహళ్లి, హోస్కోట్.. అలాగే తమిళనాడులోని హోసూర్‌లను అనుసంధానిస్తుంది. ఇప్పటికే దొబ్బస్‌పేట్-హోస్కోట్ మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా.. మిగిలిన భాగాలు తుది దశ నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమయ్యే 7 కిలోమీటర్ల ఓవర్‌ల్యాప్ విభాగం కూడా పూర్తయి కార్యాచరణలో ఉంది.

లింగదీరమల్లసంద్ర వద్ద 50 మీటర్ల పొడవైన బోస్ట్రింగ్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి నైరుతి రైల్వే (SWR) నుంచి అనుమతి ఆలస్యం కావడం వల్ల ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది. అయితే, ఇటీవల రైల్వే శాఖ నుంచి అనుమతులు లభించడంతో NHAI మిగిలిన సివిల్, భద్రతా పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం కర్ణాటక సరిహద్దు గ్రీన్‌ఫీల్డ్ విభాగం 94.89%, బెళగొండపల్లి నుండి కర్ణాటక సరిహద్దు వరకు గల విభాగం 91.32% పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్, నవంబర్ 2026 నాటికి సిద్ధం కానున్నాయి.
ఈ STRR అందుబాటులోకి రావడం వల్ల నేరుగా Bengaluru నగరంలోకి ప్రవేశించకుండానే జాతీయ రహదారులైన NH-44 (హైదరాబాద్-బెంగళూరు-హోసూర్), NH-48 (బెంగళూరు-తుమకూరు) మధ్య వాహనాలు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. తమిళనాడులోని హోసూర్ ప్రాంతం నుండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే వారికి ఇది అత్యంత వేగవంతమైన ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ సిటీ, హోసూర్ రోడ్డుపై రోజూ ప్రయాణించే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు, సరుకు రవాణా వాహనదారులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం లభించడంతో పాటు సమయం, ఇంధనం గణనీయంగా ఆదా అవుతాయి.


Click it and Unblock the Notifications
