ఈ రోజుల్లో జాబ్ దొరకడం అనేది చాలా కష్టతరంగా మారింది. ఇంటర్వ్యూలకు ఎన్నో సార్లు హాజరు అయితే కాని ఉద్యోగం రావడం లేదు. ఇక వేరే రాష్ట్రాలకు ఇంటర్వ్యూకు వెళితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరగడమే తప్ప జాబ్ రాదు. కంపెనీ ఖర్చులను భరిస్తుందా అంటే భరించదు. ఒకవేళ భరిస్తామని చెప్పినా ఆ తర్వాత ఇంటర్యూ అయిపోగానే ఖర్చుల ఊసే ఎత్తదు. ఇలా ఎందరో అభ్యర్థులు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వేరే రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ యువతి ఇంటర్వ్యూలో తనకు జరిగిన దారుణమైన పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ యువతి కథ విన్న నెటిజన్లు అయ్యో పాపం అంటూ కంపెనీ మీద మండిపడుతున్నారు.
రెడ్డిట్ లో ఒకరు ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్టు ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక అభ్యర్థిని ముఖాముఖి ఇంటర్వ్యూకు ఆహ్వానించారు.ఆ స్టార్టప్‌తో రిమోట్ ఇంటర్వ్యూలలో అనేక రౌండ్లు పాల్గొన్నారు. ఈఇంటర్వ్యూ మరింతగా ముందుకు సాగిన తర్వాత.. కంపెనీ ఆమెను తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపించింది. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు ఆమెను స్వయంగా కలవాలనుకుంటున్నట్లు ఆమెకు కంపెనీ తెలిపింది.

దీంతో వారు ఆమెను ఫేస్ టూ ఫేస్ రౌండ్ కోసం బెంగళూరుకు రమ్మని అడిగారు. ప్రయాణ ఖర్చులన్నీ తిరిగి చెల్లిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.అయితే ఆమె ఆర్థిక ఇబ్బందులు కారణంగా యూపీ నుంచి బెంగుళూరుకు వెళ్లలేకపోయింది. సాయం చేయాలని స్నేహితుడిని అభ్యర్థించింది. కంపెనీ ఖర్చులను తిరిగి చెల్లిస్తుందని అవి రాగానే నీకు ఇస్తానని స్నేహితుడికి చెప్పింది. స్నేహితుడు కూడా సరేనంటూ తన క్రెడిట్ కార్డు ద్వారా ఆ యువతికి విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. కంపెనీ తిరిగి ఖర్చులను చెల్లిస్తుందని నమ్మాడు.
అయితే బెంగుళూరుకు వెళ్లిన యువతి ఆశలు అడియాసలయ్యాయి. వారాలు, నెలలు గడిచినా కంపెనీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఆమె తన జాబ్ విషయమై కంపెనీకి ఎన్నో సార్లు మెయిల్ చేసినా కంపెనీ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఇక ప్రయాణ సమయంలో తిరిగి ఇస్తామని చెప్పిన ఖర్చుల గురించి ఊసే లేదు. దీంతో విసుగు చెందిన ఆమె స్నేహితుడు ఈ విషయానికి సంబంధించిన పరిస్థితిని పంచుకోవడానికి రెడ్డిట్ లోని ఇండియన్ వర్క్‌ప్లేస్ కమ్యూనిటీకి వెళ్లాడు. పైన జరిగిన విషయాన్ని పోస్ట్ రూపంలో అక్కడ వేశాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. ఆ యువతిపై సానుభూతితో పాటుగా చాలామంది నెటిజన్లు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ కార్పొరేట్ భారతదేశంలో ఒక పెద్ద సమస్యను హైలైట్ చేసిందనే చెప్పుకోవచ్చు. కంపెనీపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ సమయంలో ఖర్చుల మీద కంపెనీపై ఎప్పుడూ ఆధారపడకూడదని చాలామంది తెలిపారు. పట్టణం వెలుపల ప్రయాణం అవసరమయ్యే ఇంటర్వ్యూలకు హాజరు కావడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మరికొందరు తెలిపారు. వాగ్దానాలు వ్రాతపూర్వకంగా లేనప్పుడు మరింత జాగ్రత్త అవసరమని తెలిపారు.


Click it and Unblock the Notifications