Bengaluru: బెంగళూరులో పెట్రోల్ రేట్ల మోత.. లీటర్ ధర వింటేనే గుండె గుభేల్!
మధ్యతరగతి ప్రజలపై ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) లో వాహనదారులకు షెల్ (Shell) కంపెనీ మరో గట్టి షాక్ ఇచ్చింది. తన బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ రేట్ల ప్రకారం.. షెల్ ప్రీమియం పెట్రోల్ ధర ఏకంగా లీటరుకు రూ. 136 మార్కును దాటిపోయింది. దీంతో రోజువారీ ఆఫీసులకు, పనులకు వెళ్లే సామాన్య ప్రజలు, ముఖ్యంగా టూ వీలర్స్, కార్లు వాడేవారి జేబులకు పెద్ద చిల్లు పడుతోంది.

ఒకేసారి రూ. 3 పెంచిన షెల్.. కొత్త రేట్లు ఇవే!
మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) లో జరుగుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలతో ఇటీవల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మూడు రూపాయల వరకు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల కంటే ముందే ప్రైవేట్ ఇంధన దిగ్గజం షెల్.. బెంగళూరు (Bengaluru) లో వరుసగా రెండోసారి రేట్లను బాదేసింది. తాజా పెంపుతో షెల్ పెట్రోల్ ధర రూ. 128 నుండి ఏకంగా రూ. 136.50 కి చేరింది.
ప్రస్తుతం షెల్ బంకుల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
- షెల్ ప్రీమియం పెట్రోల్: రూ. 136.51 (లీటరుకు)
- వి-పవర్ (V-Power) పెట్రోల్: రూ. 132.85 (లీటరుకు)
- షెల్ ప్రీమియం డీజిల్: రూ. 136.51 (లీటరుకు)
ఇక నార్మల్ డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 123 నుండి రూ. 126 కి పెరిగింది. క్వాలిటీ బాగుంటుందని షెల్ బంకులను నమ్ముకునే రెగ్యులర్ కస్టమర్లకు ఈ సడన్ షాక్ అస్సలు మింగుడుపడటం లేదు.
సామాన్యుడిపై 'ధరల' చైన్ రియాక్షన్
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం కేవలం వాహనదారుల పైనే కాదు, మార్కెట్లో ఉండే అన్ని వస్తువుల పైనా పడుతుంది. రవాణా ఖర్చులు (Transport Costs) పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం, కందిపప్పు (Tur Dal) ధరలు భారీగా పెరిగి సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీశాయి. ఇప్పుడు ఈ ఇంధన ధరల పెరుగుదల కూడా తోడవడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి "కత్తిమీద సాము"లా మారింది. హోటల్ ఫుడ్ రేట్లు, క్యాబ్, ఆటో ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధాని మోదీ కీలక సలహా.. మనం ఏం చేయాలి?
ఈ ఇంధన సంక్షోభాన్ని , విదేశీ చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని, షార్ట్ డిస్టెన్స్‌ల కోసం నడక లేదా సైకిల్స్ వాడాలని కోరారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (మెట్రో, బస్సులు) లేదా వెహికల్ పూలింగ్ చేసుకోవడం ఉత్తమమని, అలాగే వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) మారడం ద్వారా అటు పర్యావరణాన్ని, ఇటు జేబును కాపాడుకోవచ్చని ప్రధాని సలహా ఇచ్చారు. మరి ఈ ధరల మంటలకు బ్రేక్ పడాలంటే మనం కూడా లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications