బెంగళూరులో ఖాళీ స్థలాల యజమానులకు BBMP బిగ్ షాక్.. 30 రోజుల్లో ప్లాట్లు శుభ్రం చేయకపోతే భారీ జరిమానా..
భారత ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరాన్ని పరిశుభ్రంగా.. సుందరంగా మార్చేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) కీలక నిర్ణయం తీసుకుంది. Bengaluru నగరంలోని ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పెరిగిన కలుపు మొక్కలు.. వృక్షసంపద, పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి నెల రోజుల గడువు విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా యజమానులు తమ స్థలాలను శుభ్రం చేసుకోకపోతే.. పౌరసంఘమే ఆ బాధ్యతను తీసుకుని శుభ్రపరుస్తుందని, దానికి అయిన ఖర్చును సదరు యజమానుల ఆస్తి పన్ను (Property Tax) బకాయిలకు జోడించి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. దీనికి ఆగస్టు 15 డెడె లైన్ విధించింది.
ఐదు నగర కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ ఈ వివరాలను వెల్లడించారు. నగరంలోని చాలా ప్రాంతాలలో చెత్త సేకరణ సక్రమంగా లేకపోవడం వల్ల ఖాళీ స్థలాలు వ్యర్థాలు వేసే కేంద్రాలుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యజమానులు కూడా పట్టించుకోకపోవడంతో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయి.. నిర్మాణ శిథిలాలు, ఘన వ్యర్థాలు, మట్టి దిబ్బలతో ఆ ప్రాంతాలు నిండిపోతున్నాయని, వాటన్నింటినీ పూర్తిగా తొలగించడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

నగరంలో అక్రమంగా చెత్త వేసే (డంపింగ్) సమస్యలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆగస్టు నెల మొత్తం పాటు వ్యర్థాల నుండి స్వేచ్ఛ అనే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మంత్రి ప్రకటించారు. బెంగళూరు పరిశుభ్రతను పెంపొందించడానికి నగరపాలక సంస్థలతో పాటు కే-రైడ్ (K-RIDE), రైల్వే, మెట్రో, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో సంయుక్తంగా ఈ ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు.
ఈ ప్రచారంలో భాగంగా మరికొన్ని కఠిన నిబంధనలను కూడా తీసుకువచ్చారు:
నగరంలో నిర్మాణ మరియు కూల్చివేత (C&D) వ్యర్థాలను రవాణా చేసే వాహనాలన్నింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి.
వ్యర్థాలను తరలించే అటువంటి అన్ని రవాణా వాహనాలలో జీపీఎస్ (GPS) ట్రాకింగ్ పరికరాలను అమర్చడం కూడా తప్పనిసరి చేశారు.
ఇదే కాకుండా, ఫుట్‌పాత్‌లపై నిలిపి ఉంచిన, వదిలివేసిన పాత వాహనాలకు 7 రోజుల నోటీసు ఇచ్చిన తర్వాత వాటిని టోయింగ్ చేసి, వేలం వేయడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు.
బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రస్తుతం GBA అధికార పరిధిలోని 1,616 ప్రదేశాలలో సుమారు 22,732 టన్నుల భారీ వ్యర్థాలు పేరుకుపోయినట్లు గుర్తించారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా నగర రూపురేఖలను మార్చాలని యంత్రాంగం భావిస్తోంది.


Click it and Unblock the Notifications
