Bike Taxi Ban in Bengaluru: కర్ణాటకలో ప్రయాణికులకు బిగ్ షాకిస్తూ.. బైక్ టాక్సీలు నేటి నుంచి బంద్ అయిన సంగతి విదితమే. అయితే బ్యాన్ ప్రభావం ఆర్థిక పరిస్థితిపై పడింది. ఒక్క బెంగుళూరు నగరంలోనే 8 కోట్ల రైడ్‌లు ఆగిపోగా.. 1 లక్ష ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో బైక్ టాక్సీ నిషేధాన్ని పునరాలోచించాలని కర్ణాటక ముఖ్యమంత్రిని డ్రైవర్లు కోరారు. నేటి నుండి బైక్ టాక్సీ సేవలపై పూర్తి నిషేధం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీకి లేఖ రాసింది.
బెంగళూరు నగరంతో పాటుగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా గిగ్ కార్మికులు బైక్ టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని.. వారు కుటుంబ పోషణ కోసం రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారని అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది. ఇప్పుడు బ్యాన్ చేస్తే జీవనాధారం లేక వీరంతా రోడ్డు మీదకు వస్తారని లేఖలో పేర్కొంది. ఇది సైడ్ ఆదాయం కాదని ప్రధాన వనరుగా వీరంతా బతుకుతున్నారని నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని లేఖలో నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కోరింది.

ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటక ప్రభుత్వం కూడా లైసెన్సింగ్, శిక్షణ, బీమా, భద్రతా ప్రమాణాలపై సరైన నియమాలను తీసుకురావాలని అసోసియేషన్ పేర్కొంది. కాగా స్పష్టమైన విధానం లేనప్పుడు రాపిడో, ఓలా, ఉబర్ మోటో వంటి ప్లాట్‌ఫామ్‌ల బైక్ టాక్సీ కార్యకలాపాలను చట్టవిరుద్ధమని ప్రకటించిన గత ఆదేశాన్ని సమర్థిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కోరింది. బెంగుళూరు నగరంలో బైక్ టాక్సీలు సంవత్సరానికి దాదాపు 8 కోట్ల రైడ్‌లను అందిస్తాయని లేఖలో పేర్కొంది.
బైకులను కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా వినియోగించవద్దని సిద్ధరామయ్య సర్కారు..ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే నేటి నుంచి రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీలు హైకోర్టులో సవాల్ చేశాయి. అయితే హైకోర్టులో వాటికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రవాణాశాఖ రూల్స్ ప్రకారం.. టూ వీలర్స్ ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను హైకోర్టు సమర్థించింది.
2025 ఏప్రిల్‌లో కర్ణాటక హైకోర్టు బైక్ సేవలను అందించే ఈ కంపెనీలకు జూన్ 15 వరకు బైక్ టాక్సీ సేవలను కొనసాగించడానికి మధ్యంతర అనుమతి ఇచ్చింది. అయితే..కోర్టు ఇప్పుడు ఈ ఉపశమనాన్ని పొడిగించడానికి నిరాకరించింది.పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బి.ఎం. శ్యామ్ ప్రసాద్ ధర్మాసనం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం కింద స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేసే వరకు, ఈ సేవలను రాష్ట్రంలో నిర్వహించబోమని పేర్కొంది. నియమాలను రూపొందించడానికి కోర్టు ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇచ్చింది.


Click it and Unblock the Notifications