ఐటీ లేఆప్స్ దెబ్బ.. బెంగళూరులో భారీగా తగ్గిన అద్దె ధరలు..ఎంతలా అంటే..
Bengaluru House Rents: బెంగుళూరులో ఇంటి అద్దె ధరలు భారీగా తగ్గుతున్నాయా... 2025లో ప్రపంచ ఐటీ రంగంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో అద్దె ధరలు తగ్గుతున్నాయన్న వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది రెడ్డిట్ పోస్ట్‌గా మొదలైన ఈ వార్త భారతదేశ టెక్ నగరమైన బెంగళూరులో ఉద్యోగ స్థిరత్వంపై హాట్ డిబేట్ కు వేదికగా మారింది. ఒక రెడ్డిట్ వినియోగదారు ఇటీవల పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. 4-5 నెలల క్రితం రూ. 40 వేల బడ్జెట్‌లో గేట్‌డ్ కమ్యూనిటీలో 2BHK ఫ్లాట్ దొరికేది కాదు..కానీ ఇప్పుడు అదే బడ్జెట్‌లో ఎన్నో ఫ్లాట్‌లు లభ్యమవుతున్నాయని చెబుతున్నారు.
ఈ పోస్ట్ IT రంగంలో ఉద్యోగ నష్టాల కారణంగా మార్కెట్‌లో గృహ డిమాండ్ తగ్గుతోందనే ఊహాగానాలను మరింతగా బలపరుస్తోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఐటీ రంగంలొ ఉద్యోగాల తొలగింపు భయం నెలకొంది. చాలా మంది ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం లేదా అద్దె ఎక్కువ ఉన్న ఇళ్లను తీసుకోవడం లేదు. పొదుపు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మరొక నెటిజన్ మాట్లాడుతూ.. గత సంవత్సరం RTO (రిటర్న్ టు ఆఫీస్) విధానం వల్ల అద్దె ధరలు పెరిగాయి. ఇప్పుడు లేఆఫ్స్ కారణంగా ప్రజలు జీతాల్లో పెద్ద భాగాన్ని అద్దెకు ఖర్చు చేయాలనుకోవడం లేదన్నారు.

ఐటీ ఇండస్ట్రీ వర్గాలు ఈ పరిణామాన్ని సైలెంట్ లేఆఫ్స్ ప్రభావంగా చూస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులకు సంకేతమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 ఏడాది టెక్ ఉద్యోగులకి తీవ్రమైన ఒత్తిడిని మిగిల్చిన సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా చూసుకుంటే టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ 9,100 ఉద్యోగాలను కోత పెట్టగా.. గూగుల్ తన Google TV విభాగంలో 25 శాతం సిబ్బందిని తగ్గించింది.
అమెజాన్ AWS విభాగంలో సీనియర్ ఉద్యోగాలపై దృష్టి సారించింది. ఇంటెల్ ఒరెగాన్‌లో 500 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయింది, ఇంకా 5,500 మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. క్రౌడ్‌స్ట్రైక్ తన మొత్తం శ్రామిక శక్తిలో 5 శాతం తొలగింపుని ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (AI) వల్ల ఉత్పాదకత పెరుగుతుందని వాదనలు ఉన్నా లేఆప్స్ మాత్రం చాలా బలంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం AI అనేక ఉద్యోగాలను తిరిగి పరిశీలించి తక్కువ కార్మిక శక్తితో సాగిపోవడానికే దోహదపడుతోంది.
దీని ప్రభావం భారతదేశంలో ముఖ్యంగా ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన బెంగళూరులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గటం, పెట్టుబడులు తగ్గిపోవడం, తద్వారా నగరంలో అద్దె ధరలు తగ్గుతున్నాయి. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతానికి ఆన్‌లైన్ చర్చల్లోకే పరిమితమైనా.. మార్కెట్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications