బెంగళూరులో ఇంటి అద్దె రూ. 10 వేలు.. మీకెప్పుడైనా దొరికిందా..ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే..
దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ అయిన బెంగళూరులో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం అద్దె ధరలలో భారీ పెరుగుదలను చూస్తోంది. ఒకప్పుడు అందరికీ సరసమైన టెక్ హబ్‌గా పేరు పొందిన ఈ నగరం ఇప్పుడు కాస్ట్ లీ నగరంగా మారింది. ముఖ్య ప్రాంతాలలో 1BHK ఫ్లాట్ల అద్దె ధరలు నెలకు రూ. 45,000- రూ. 60,000 వరకు పెరిగాయి. చాలా మంది యువ నిపుణులు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు ఈ రెంట్లు కట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇందిరానగర్, డిఫెన్స్ కాలనీ, కోరమంగళ వంటి ప్రాంతాల్లో 400-600 చదరపు అడుగుల చిన్న ఫ్లాట్లకే రూ. 50 వేల వరకు అద్దె అడుగుతున్నారు. గతంలో 750 చదరపు అడుగుల 1BHKలు సాధారణంగా ఉండేవి. ఇప్పుడు అవి 450-550 చదరపు అడుగులకు తగ్గిపోయాయి. కారణం ఏంటంటే.. డెవలపర్లు ఒకే ప్లాట్‌లో ఎక్కువ యూనిట్లు కట్టడం ద్వారా లాభాలు పెంచుకోవాలని చూడటంగా చెప్పుకోవచ్చు.
Bengaluru లో అద్దె డిపాజిట్ వ్యవస్థ మరో పెద్ద సమస్యగా మారింది. ఇంటి యజమానులు సాధారణంగా 6-10 నెలల అద్దెను ముందుగానే డిపాజిట్‌గా అడుగుతారు. అంటే, ఒక రూ. 50,000 అద్దె ఫ్లాట్ కోసం రూ. 3-5 లక్షల వరకు డిపాజిట్ పెట్టాల్సి ఉంటుంది. ఇది యువ నిపుణులు, కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టిన వారికీ పెద్ద ఆర్థిక భారంగా మారింది.

రియాల్టీ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. మహమ్మారి తర్వాత కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రావాలని చెప్పడంతో బెంగళూరులో అద్దె ధరలు భారీగా పెరిగాయి. కోరమంగళ, HSR లేఅవుట్, వైట్‌ఫీల్డ్ వంటి టెక్ హబ్‌లలో డిమాండ్ సరఫరాను మించి పోయింది. ఫలితంగా, కొన్ని సంవత్సరాల క్రితం రూ. 20,000కి దొరికే 1BHKలు ఇప్పుడు రూ. 40,000-రూ. 50,000 వరకు వెళ్లిపోయాయి. అధిక అద్దెల కారణంగా, చాలా మంది స్టూడియో అపార్ట్‌మెంట్‌లు లేదా ఒక గది-కిచెన్ యూనిట్లను ఎంచుకుంటున్నారు. వీటి పరిమాణం సాధారణంగా 300-400 చదరపు అడుగులు. కోరమంగళ, ఇందిరానగర్, HSR లేఅవుట్‌లలో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. అద్దె రూ. 15,000-రూ.20,000 మధ్యలో ఉండి, కొన్ని సందర్భాల్లో ఫర్నిష్డ్‌గా కూడా లభిస్తున్నాయి.
ఎక్కువ జీతాలు పొందే టెక్ ఉద్యోగులు ఈ అధిక అద్దెలను భరించగలుగుతున్నప్పటికీ, విద్యార్థులు, ఫ్రెషర్లు, మధ్యతరగతి కుటుంబాలు నగర శివార్లకు వెళ్ళాల్సి వస్తోంది. యలహంక, కెఆర్ పురం, సర్జాపూర్ రోడ్ వంటి ప్రాంతాలలో అద్దె కొంత తక్కువగా ఉండే అవకాశముంది. కానీ ఇక్కడ కూడా ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి.
రియాల్టీ నిపుణుల అంచనాల ప్రకారం, డిమాండ్ అధికంగా ఉండటం వల్ల బెంగళూరు అద్దెలు త్వరలో తగ్గే అవకాశం లేదు. చిన్న పరిమాణంలో కొత్త యూనిట్లు పెరుగుతూనే ఉంటాయి, కానీ వాటి అద్దె కూడా సరసమైన స్థాయిలో ఉండదని చెబుతున్నారు. ఇంటి యజమానులకు అద్దె అనేది ఉన్నత రాబడికి కాకుండా నగదు ప్రవాహానికి సంబంధించిన వ్యాపారంగా మారింది. కాబట్టి, భవిష్యత్తులో అద్దెదారులు మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. బెంగళూరులో రూ. 10-రూ. 12 వేల బడ్జెట్‌లో ఇల్లు దొరకడం దాదాపు అసాధ్యం. రూ. 20,000-రూ. 25,000 శ్రేణిలో కొద్ది ఎంపికలు ఉండవచ్చు, కానీ ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు నెలకు రూ. 45 వేలకు పైగానే వెళ్లిపోయాయి. ఇది నగరాన్ని కొత్తగా వచ్చే ఉద్యోగులు, విద్యార్థుల కోసం మరింత ఖరీదైన గమ్యస్థానంగా మార్చింది.


Click it and Unblock the Notifications