Bengaluru : బెంగళూరులో 2BHK రెంట్ తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే.. వైరల్ అవుతున్న పోస్ట్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం ఐటీ ఉద్యోగులకు స్వర్గధామం. కానీ, గత కొద్దికాలంగా ఇక్కడ అద్దెలు చూస్తుంటే సామాన్యులే కాదు, లక్షల్లో జీతం తీసుకునే టెక్కీలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులోని అద్దె గదుల ధరల గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూస్తే.. "మరీ ఇంత అత్యాశేంటి బాబోయ్" అనకుండా ఉండలేరు.

2BHK ఫ్లాట్ అద్దె రూ.70,000!
రాజ్వి అనే 24 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె తూర్పు బెంగళూరులోని ప్రధాన ఐటీ హబ్ అయిన కదుబీసనహళ్లి (Kadubeesanahalli) ప్రాంతంలో ఒక ఫ్లాట్ కోసం వెతుకుతోంది. అక్కడ ఒక మామూలు సెమీ ఫర్నిష్డ్ 2BHK ఫ్లాట్‌కు నెలకు ఏకంగా రూ.70,000 అద్దె అడిగారు. ఇది విని ఆమె షాక్‌కు గురై.. "బెంగళూరు రెంట్ సీన్ పిచ్చెక్కిస్తోంది.. ముంబైతో పోటీ పడుతోంది" అంటూ ఎక్స్ లో (ట్విట్టర్) ఆవేదన వ్యక్తం చేసింది.
నెటిజన్ల ఫన్నీ & సీరియస్ రియాక్షన్స్
ఈ పోస్ట్ బయటకు రాగానే బెంగళూరు (Bengaluru) నివాసితులు పెద్ద ఎత్తున స్పందించారు. నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఓనర్ల అత్యాశను ఎండగట్టారు.
- ట్రామా ఫర్నిష్డ్: "సెమీ ఫర్నిష్డ్ అంటే ఏంటి? ఆ అద్దె విన్నప్పుడు కలిగే మానసిక ఆవేదన (Trauma) కూడా అందులో భాగమేనా?" అని ఒక యూజర్ జోక్ చేశారు.
- డిపాజిట్ గోల: "అద్దె రూ.70 వేలు అంటే.. దానికి 11 నెలల డిపాజిట్ (దాదాపు రూ.7.7 లక్షలు) ఎవరు కడతారు? అంత కట్టి మళ్ళీ సొసైటీ పెద్దల క్లాసులు వినాలా?" అని మరో టెక్కీ ఫైర్ అయ్యాడు.
- ట్రాఫిక్ బోనస్: "కదుబీసనహళ్లిలో అంత అద్దె కట్టి, ఆ నరకం లాంటి ట్రాఫిక్ భరించడం నిజంగా ఒక సాహసమే" అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఈస్ట్ బెంగళూరులోనే ఈ దారుణం!
సాధారణంగా బెంగళూరులో అన్ని చోట్లా రేట్లు ఇలాగే లేవని కొందరు గుర్తుచేస్తున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాలలో 2BHK అద్దె సగటున రూ.25,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది. కానీ, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న వైట్‌ఫీల్డ్, కదుబీసనహళ్లి, సర్జాపూర్ రోడ్ వంటి ప్రాంతాలలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంటి ఓనర్లు రేట్లు పెంచేస్తున్నారు.
జీతాలు వెస్ట్రన్.. ఖర్చులు వెస్ట్రన్ కంటే ఎక్కువ!
మరికొందరు నెటిజన్లు మాట్లాడుతూ.. బెంగళూరు (Bengaluru) ఇప్పుడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా మారుతోందని, అయితే అది కేవలం అద్దెల విషయంలోనే అని ఎద్దేవా చేస్తున్నారు. "మీరు ఫ్లాట్ ను రెంట్ కు తీసుకోవడం లేదు.. దానికోసం ఆడిషన్ ఇస్తున్నారు" అని ఒక యూజర్ అన్న మాటలు అద్దె మార్కెట్ పరిస్థితిని అద్దం పడుతున్నాయి. ఏదేమైనా ఈ రెంట్ హైక్ ఇప్పుడు బెంగళూరులో ఉండాలనుకునే మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులకు పెను భారంగా మారింది.


Click it and Unblock the Notifications