బెంగళూరు రియల్ ఎస్టేట్.. సొంతిల్లు వద్దు బాబోయ్ అంటున్న ఉద్యోగులు..షాకింగ్ కారణం ఏంటంటే..
Bengaluru Real Estate: భారత ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ Bengaluru నగరంలో ఇల్లు కొనాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగాయి. ఐటీతో పాటు పలు రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా అక్కడ ఉండటంతో అందరూ సిలికాన్ సిటీ వైపు చూస్తున్నారు. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంది. దీంతో అక్కడ ఇల్లు కొంటే చాలు అనే స్థితికి ఉద్యోగులు వచ్చేశారు. అయితే ఇప్పుడే అదే వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.
నేడు ఐటీ రాజధాని బెంగళూరులో నివాస గృహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఐదేళ్లలో నగరంలో ఆస్తి విలువలు అనూహ్యంగా పెరగడంతో సగటు ఉద్యోగి, వృత్తి నిపుణులకు సొంత ఇల్లు కొనడం అనేది ఇక ఎప్పటికీ నెరవేరని కలలా మారిపోతోంది. ప్రధానంగా నగర కేంద్ర ప్రాంతాలలో 2BHK ఫ్లాట్ల ధరలు ప్రస్తుతం రూ. 1.4 కోట్ల నుండి రూ. 1.8 కోట్ల మధ్యకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు నగరంలో సామాన్యులకు అందుబాటులో ఉండే రూ. 1 కోటి లోపు ఇళ్లు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి.

గత ఐదేళ్ల కాలంలో బెంగళూరులోని టాప్ 5 ప్రాపర్టీ హాట్‌స్పాట్‌లలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటిలో కొన్ని ప్రధాన ప్రాంతాలలో ఆస్తి విలువలు ఏకంగా 204 శాతం వరకు పెరగడం గమనార్హం. ఈ హఠాత్తు లీప్ వల్ల అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలనుకునే వారిపై ఈఎంఐల భారం భారీగా పడుతోంది. ప్రస్తుతం ఇల్లు కొంటే నెలకు కనీసం రూ. 80,000 నుండి రూ. 1.1 లక్షల వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తోంది. ఇది నగరంలో ఉద్యోగాలు చేసే ఎక్కువ మంది టెక్కీలు, వృత్తి నిపుణుల నెలవారీ ఆదాయం, ఆర్థిక సౌకర్యానికి మించిపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై సోషల్ మీడియా వేదికలైన X (ట్విట్టర్), రెడ్డిట్ (Reddit) లలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒక నెటిజన్ రూ. 1.2 కోట్ల ఫ్లాట్ కొని భారీ ఈఎంఐల భారాన్ని మోయడం మేలా? లేక రూ. 44,000 అద్దె చెల్లిస్తూ మిగిలిన డబ్బును ఆదా చేసుకోవడం మేలా? అని పెట్టిన పోస్ట్ నెట్టింట తీవ్ర వైరల్‌గా మారింది.
2026 నాటికి బెంగళూరులో సొంత ఇల్లు కొనుగోలు చేయడం చేజారిపోతోందని ఒక ఎన్‌ఆర్‌ఐ వ్యాఖ్యానించగా.. మంచి 2BHK ఫ్లాట్లు రూ. 1.4 కోట్ల నుంచే ప్రారంభమవుతుంటే ఇల్లు కొనడం ఒక కలలా మిగిలిపోతోందని మరొకరు వాపోయారు. కేవలం బెంగళూరులోనే కాకుండా మైసూరు, మంగళూరు వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోని వినియోగదారులు కూడా తాము ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందులనే పంచుకోవడంతో ఈ పోస్టులకు వేలాది స్పందనలు వచ్చాయి.
ప్రస్తుతం నగరవాసులు అద్దెకు ఉండాలా లేక ఎలాగోలా కష్టపడి ఇల్లు కొనాలా అనే పెద్ద సందిగ్ధంలో పడ్డారు. అద్దెకు ఉండి, ఆదా చేసిన నిధులను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడిగా పెట్టడం ఆర్థికంగా మంచిదని కొందరు సలహా ఇస్తుంటే.. నిరంతరం పెరుగుతున్న ఇళ్ల అద్దెల భారం నుండి రక్షణ పొందడానికి, కుటుంబ స్థిరత్వం కోసం ఎంత ధరైనా సొంత ఇల్లే శ్రేయస్కరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, నగరంలో అటు అద్దెల షాక్, ఇటు ఆకాశాన్నంటిన ఆస్తి ధరల నడుమ సాధారణ మధ్యతరగతి జీవులు నలిగిపోతున్నారు. మున్ముందు ఈ ధరలు మరింత పెరిగితే నగరంలో సొంత ఇల్లు అనేది సగటు మానవుడికి పూర్తిగా అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
