బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బీడీఏ నుంచి రూ.4 లక్షలు బహుమతిగా గెలుచుకునే అవకాశం..
Bengaluru Real Estate News: బెంగళూరులో నివసిస్తున్న వారికి గుడ్ న్యూస్.. సమాచారమిస్తే చాలు రూ. 4 లక్షల వరకు గెలుచుకునే అవకాశం. నకిలీ పత్రాల అక్రమార్కులపై బెంగళూరు అథారిటీ కొరడా విధింపులో భాగంగా బీడీఏ భూ ఆక్రమణలపై మీరు సమాచారమిస్తే రూ. 4 లక్షల బహుమతి అందిస్తామని BDA ప్రకటించింది. బెంగళూరు నగరంలో తమ ఆధీనంలో ఉన్న విలువైన భూములు, సైట్లలో జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అరికట్టడానికి, నకిలీ పత్రాల ద్వారా ఆస్తులను కాజేసిన వారిని పట్టుకోవడానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (BDA) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
బీడీఏ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించి కచ్చితమైన, ధృవీకరించదగిన ఆధారాలను అందించే సాధారణ పౌరులకు బహుమతులు అందించే ప్రత్యేక నగదు ప్రోత్సహక పథకాన్ని అథారిటీ అధికారికంగా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం కింద.. ఆక్రమిత ఆస్తి పరిమాణాన్ని బట్టి సమాచారం అందించిన వారికి గరిష్టంగా రూ. 4 లక్షల వరకు బహుమతి లభించనుంది.

ఆస్తి పరిమాణాన్ని బట్టి బహుమతి వివరాలు: బీడీఏ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. నివేదించబడిన ఆక్రమిత స్థలం లేదా ఆస్తి విస్తీర్ణాన్ని బట్టి బహుమతి మొత్తాలను వర్గీకరించారు:
రూ. 50 వేలు: 20 × 30 అడుగుల స్థలం ఆక్రమణను నివేదించినందుకు.
రూ. 1 లక్ష: 30 × 40 అడుగుల స్థలం ఆక్రమణపై సరైన ఆధారాలు అందించినందుకు.
రూ. 2 లక్షలు: 40 × 60 అడుగుల స్థలం ఆక్రమణ సమాచారానికి.
రూ. 4 లక్షలు: 50 × 80 అడుగుల భారీ స్థలం లేదా బహుళ అంతస్తుల భవనాల (Multi-storied buildings) అక్రమ ఆక్రమణల గురించిన పక్కా సమాచారానికి.
సమాచారం అందించిన ఇన్ఫార్మర్లు సమర్పించే విజ్ఞప్తులు, డాక్యుమెంట్లను అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా ధృవీకరించిన తర్వాతే ఈ నగదు బహుమతిని ఖరారు చేస్తారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.
ఒకవైపు అక్రమ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్న బీడీఏ, మరోవైపు తన సొంత ప్రధాన కార్యాలయ భవన కూల్చివేత ప్రతిపాదనతో ప్రజలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కుమార పార్క్ వెస్ట్లో ఉన్న బీడీఏ హెడ్క్వార్టర్స్ భవనాన్ని కూల్చివేసి.. దాని స్థానంలో నూతన బహుళ అంతస్తుల కాంప్లెక్స్ నిర్మించాలనే ప్రతిపాదనను 'కర్ణాటక రక్షణ వేదిక (శివరామేగౌడ వర్గం)', 'బీడీఏ ఉద్యోగుల సంఘం' తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ భవనానికి సుమారు 80 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందని.. దీనిని మొదట మైసూరు మహారాజుల కాలంలో స్థాపించారని నిరసనకారులు గుర్తుచేస్తున్నారు. నగర పరిపాలనా వారసత్వంలో ఇదొక కీలక భాగమని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనం నిర్మాణాత్మకంగా చాలా పటిష్టంగా ఉందని, రాబోయే 40 నుండి 50 సంవత్సరాల పాటు ఇది ఎలాంటి ఢోకా లేకుండా సేవలు అందించగలదని ఉద్యోగుల సంఘం పేర్కొంది. ప్రాంగణంలో దశాబ్దాలుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఆ ప్రాంత పర్యావరణానికి, వారసత్వానికి చిహ్నాలుగా నిలిచాయని, కూల్చివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఈ కూల్చివేత ఆలోచనను తక్షణమే విరమించుకుని.. చారిత్రక భవనాన్ని అలాగే ఉంచుతూనే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలను అన్వేషించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
నగరంలో పెరుగుతున్న ఆస్తుల రీసేల్ అక్రమాలు, నకిలీ జీ-కేటగిరీ సైట్ల కుంభకోణాల నేపథ్యంలో బీడీఏ తీసుకొచ్చిన 'రివార్డ్ స్కీమ్' పౌరుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అయితే, భూక్రమణలను అరికట్టే ప్రక్రియలో పారదర్శకతతో పాటు, తన స్వంత చారిత్రక వారసత్వ భవనాలను కాపాడుకోవడంలో కూడా అథారిటీ అంతే బాధ్యతగా వ్యవహరించాలని బెంగళూరు పౌర సమాజం, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications
