బెంగళూరుకు ఏమైంది.. ప్రపంచంలోనే మూడవ అత్యంత చెత్త నగరంగా రికార్డు.. సార్థక్ అహుజా షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు.. దేశంలోని ఐటీ పరిశ్రమకు, స్టార్టప్‌లకు, టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు, గ్లోబల్ కంపెనీల కార్యాలయాలు, పెట్టుబడిదారుల రాకతో.. ఈ నగరం కలల గమ్యస్థానంగా పేరుతెచ్చుకుంది. ప్రతిభావంతులైన యువత, వ్యాపారవేత్తలు, నిపుణులు ఈ నగరానికి చేరుకుని తమ భవిష్యత్తును నిర్మించుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా Bengaluru నగర ఇమేజ్ మసకబారడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఆశల నగరంగా పరిగణించబడిన బెంగళూరు, ఇప్పుడు చాలా మంది నివాసితులకు రోజువారీ సవాళ్లతో నిండిన ప్రదేశంగా మారిపోయింది.
ఈ మార్పుకు ప్రధాన కారణాలను మనం విశ్లేషించుకున్నట్లయితే.. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, గుంతలతో నిండిన రోడ్లు, తాగునీటి కొరత, ఎక్కువగా పెరిగిన గృహధరలు ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక నివేదిక ప్రకారం బెంగళూరులో ప్రజలు సంవత్సరానికి సగటున 134 గంటల సమయం ట్రాఫిక్ జామ్‌లలోనే గడుపుతున్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్‌తో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతుండడంతో, ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది కుటుంబాలు, ఉద్యోగులు, చిన్న పట్టణాల్లో స్థిరపడితే జీవితం సులభంగా ఉంటుందని భావిస్తూ బెంగళూరును వదిలి వెళ్ళడం ప్రారంభిస్తున్నారు.

ఈ విపరీత ధోరణిని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం బెంగళూరు ప్రస్తుతం ప్రపంచంలో మూడవ చెత్త నగరంగా ర్యాంక్ పొందింది. దీని వలన ప్రజలు ఇతర అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఆయన ప్రత్యేకంగా మైసూరును ఉదాహరణగా చూపించారు. మైసూరులో ఎక్కడికైనా కేవలం 15 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. జీవన వ్యయం కూడా బెంగళూరు కంటే 10-20 శాతం తక్కువని ఆయన చెప్పారు.
మైసూరులో రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతోంది. గత ఏడాదిలోనే ఇక్కడ ఆస్తి ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. అయినప్పటికీ అవి బెంగళూరుతో పోలిస్తే ఇంకా 30-50 శాతం తక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కువెంపు నగర్, విజయనగర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు సుమారు రూ. 60 లక్షల నుండి ప్రారంభమవుతాయి. సరస్వతిపురం, జయలక్ష్మీపురం వంటి ప్రీమియం ప్రాంతాల్లో ధరలు రూ. 1 కోటి నుండి మొదలవుతున్నాయి. అద్దె దిగుబడులు కూడా మైసూరులో ఎక్కువగా ఉండటంతో, ఇక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి పెరుగుతోంది.
ఈ మార్పుకు మరో కారణం బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే గా చెబుతున్నారు. 2023లో పూర్తైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల రెండు నగరాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడింది. దీని వలన పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్లు మైసూరులో దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. ఇది కేవలం బెంగళూరుకే పరిమితం కాకుండా.. ముంబై, ఢిల్లీ, గుర్గావ్, పూణే వంటి ఇతర మెట్రో నగరాలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని అహుజా చెబుతున్నారు.
ఆయన అభిప్రాయం ప్రకారం గత దశాబ్దంలో మెట్రో నగరాలు రియల్ ఎస్టేట్ వృద్ధికి కేంద్రంగా నిలిచినప్పటికీ.. రాబోయే దశాబ్దంలో టైర్-2 నగరాలు అభివృద్ధి, నివాసయోగ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే, మైసూరు, విశాఖపట్నం, కోయంబత్తూరు, ఇంద్రప్రస్థ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న నగరాలు భవిష్యత్తులో పెద్ద వృద్ధి కేంద్రాలుగా మారవచ్చు.
ఏదేమైనా.. బెంగళూరు ఒకప్పుడు కలల నగరంగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఇప్పుడు మౌలిక సదుపాయాల ఒత్తిడిలో కుంగిపోతోంది. ఈ పరిస్థితుల్లో, మైసూరు వంటి టైర్-2 నగరాలు ప్రజలకు, పెట్టుబడిదారులకు, వ్యాపారాలకు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో భారతదేశ రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి దిశ మార్పు ఈ నగరాల వైపు జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications