Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?
బెంగళూరు (Bengaluru) అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ట్రాఫిక్ జామ్‌లు మాత్రమే కాదు, ప్రభుత్వ ధనం భారీగా ఖర్చయ్యే నగరం కూడా. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ సంస్థలు కలిసి రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నగర పాలనపై అధ్యయనం చేసే 'జనాగ్రహ' (Janaagraha) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంపై రోజుకు సగటున రూ. 100 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చవుతోంది.

ఏడాదికి రూ. 38,455 కోట్ల బడ్జెట్!
జనాగ్రహ నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు కోసం దాదాపు 13 ప్రభుత్వ విభాగాల ద్వారా మొత్తం రూ. 38,455 కోట్లు ఖర్చు చేశారు. 70 కి పైగా ఆర్థిక పత్రాలను విశ్లేషించిన తర్వాత ఈ గణాంకాలను బయటపెట్టారు. అయితే, ఇందులో ఒక విచిత్రమైన విషయం ఉంది. నగర మున్సిపల్ సంస్థ అయిన BBMP (ప్రస్తుతం GBA కింద ఉన్నా) ఖర్చు చేస్తున్నది కేవలం 20 శాతం మాత్రమే. మిగిలిన 80 శాతం నిధులు వివిధ ప్రభుత్వ అనుబంధ సంస్థల (Parastatal Agencies) చేతుల్లోనే ఉంటున్నాయి.
ఎవరి చేతుల్లో ఎంత డబ్బు ఉంది?
బెంగళూరు అభివృద్ధికి సంబంధించిన సింహభాగం నిధులు కింది సంస్థల ద్వారా ఖర్చవుతున్నాయి..
- Bescom: విద్యుత్ సరఫరా కోసం.
- BMRCL (నమ్మ మెట్రో): మెట్రో విస్తరణ పనులకు.
- BWSSB: నీటి సరఫరా , మురుగునీటి నిర్వహణ.
- BMTC: సిటీ బస్సుల నిర్వహణ.
- సిటీ పోలీస్: భద్రత , శాంతిభద్రతల కోసం.
ఈ సంస్థలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రజలకు వీటిపై నేరుగా ప్రశ్నించే అధికారం లేదా పర్యవేక్షణ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. దీనివల్ల పారదర్శకత (Transparency) లోపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిధులు ఉన్నా కష్టాలు తప్పవా?
వేల కోట్లు ఖర్చు చేస్తున్నా సరే, బెంగళూరు వాసులకు గుంతల రోడ్లు, నీటి ఎద్దడి, ట్రాఫిక్ గండం వంటి సమస్యలు ఎందుకు తప్పుతలేవు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి ప్రధాన కారణం 'జవాబుదారీతనం' (Accountability) లేకపోవడమే అని నిపుణులు అంటున్నారు. 2020 నుంచి నగరానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అధికారులపై ప్రజల పర్యవేక్షణ తగ్గిపోయిందన్న అభిప్రాయాలున్నాయి. ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారు, ఏ పనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపై స్పష్టమైన ఏకీకృత నివేదిక లేకపోవడం వల్ల సామాన్య పౌరులకు తమ పన్ను డబ్బు ఎక్కడ వృథా అవుతుందో అర్థం కావడం లేదు.
కేవలం నిధులు ఖర్చు చేయడం మాత్రమే కాదు, ఆ ఖర్చు ద్వారా సామాన్యుడికి ఎలాంటి ఫలితం దక్కుతుందో లెక్క తేలాల్సి ఉందని జనాగ్రహ నివేదిక స్పష్టం చేస్తోంది. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఆర్థిక పారదర్శకత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.


Click it and Unblock the Notifications