Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులే కాదు, లక్షల్లో జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు కూడా అక్కడ ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది హోమ్ బయ్యర్స్ బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా మైసూర్ వైపు మొగ్గు చూపుతున్నారు. మైసూర్‌లో తక్కువ ధరకే మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తుండటంతో అక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది.

ఏఐ భయాలు , ఉద్యోగ అనిశ్చితి
బెంగళూరులో నివసించే వారు తమ ఆస్తులను అమ్మి, ఆ పెట్టుబడిని మైసూర్‌కు మళ్లిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ వృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగాల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో భారీ ఈఎంఐలు (EMIs) కట్టే బదులు, తక్కువ ధరకే ఇల్లు దొరికే మైసూర్ వంటి టైర్-2 నగరాలకు వెళ్లడం సురక్షితమని చాలామంది భావిస్తున్నారు. బెంగళూరులోని కోరమంగళ వంటి ఖరీదైన ఏరియాల్లో ఆస్తులను విక్రయించి, ఆ సొమ్ముతో మైసూర్‌లో సెకండ్ హోమ్స్ లేదా విల్లాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
మైసూర్: తదుపరి టెక్ హబ్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 బడ్జెట్‌లో మైసూర్‌ను రాష్ట్ర తదుపరి ప్రధాన టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ , ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకర్షించడానికి మైసూర్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన ప్రకటించారు. ఇది మైసూర్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెద్ద బూస్ట్‌గా మారింది. బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ ఎంట్రీ లెవల్ ధరలు 20 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, బెంగళూరులో ఊహించలేని విధంగా మైసూర్‌లోని హెబ్బాల్ లేదా గోకులం వంటి ప్రాంతాల్లో రూ.2 కోట్లలోపే 4,000 చదరపు అడుగుల విశాలమైన ప్రాపర్టీ దొరుకుతోంది.
ధరలు , అద్దె వివరాలు
మైసూర్‌లోని కువెంపు నగర్, విజయ నగర్ , జయలక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో 2BHK అపార్ట్‌మెంట్లు రూ.60 లక్షల నుండి రూ.1 కోటి వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అద్దెలు కూడా రూ.30,000 నుండి రూ.45,000 మధ్య ఉన్నాయి. ఇక గోకులం, లక్ష్మీపురం వంటి సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో రూ.60-80 లక్షలకే ఇళ్లు లభిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ ఉన్నవారు బోగాడి, నంజనగూడు వంటి శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అక్కడ చదరపు అడుగు ధర రూ.3,450 నుండి రూ.5,400 మధ్య ఉంది.
ఒకప్పుడు కేవలం పదవీ విరమణ చేసిన వారికి స్వర్గధామంగా (Pensioners' Paradise) ఉన్న మైసూర్, ఇప్పుడు యువ వృత్తి నిపుణులకు హాట్ ఫేవరెట్‌గా మారింది. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యం , విపరీతమైన ధరల నుంచి తప్పించుకోవడానికి మైసూర్ ఒక గొప్ప వేదిక. బ్రిగేడ్, శోభ, సంకల్ప్ వంటి ప్రముఖ డెవలపర్లు ఇప్పటికే మైసూర్‌లో ప్రాజెక్టులు చేపట్టడంతో ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో ఐటీ కంపెనీలు మైసూర్‌కు తరలి వస్తే, ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు రావడం ఖాయం.


Click it and Unblock the Notifications