Bengaluru: వారం రోజుల్లో బెంగళూరు పీజీల్లో గ్యాస్ ఖాళీ..! ప్రభుత్వం ఏం చేయబోతోంది?
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లోని వేలాది మంది టెక్కీలు , విద్యార్థులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదే గ్యాస్ సిలిండర్ల కొరత. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం కారణంగా బెంగళూరులోని పీజీ (Paying Guest) యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు పీజీ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ కొరత (LPG Shortage) సమస్య ఇప్పుడు మరింత తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు నడపలేని పరిస్థితి ఎదురవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో పీజీల్లో వంటలు చేయడం సాధ్యం కాదని బెంగళూరు పీజీ ఓనర్లు నిరాశ చెందుతున్నారు.

లక్షలాది మందిపై ప్రభావం
బెంగళూరు (Bengaluru) నగరంలో సుమారు 15,000 పీజీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సాఫ్ట్‌వేర్ నిపుణులు, విద్యార్థులు, కార్మికులు కలిపి దాదాపు 10 లక్షల మంది నివసిస్తున్నారు. వీరందరికీ రోజుకు మూడు పూటలా భోజనంతో పాటు వేడి నీటి సదుపాయం కూడా పీజీలే కల్పిస్తాయి. ఎల్‌పీజీ కొరత వల్ల ఈ సేవలన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ డిటి మాట్లాడుతూ.. "మా దగ్గర గరిష్టంగా వారం రోజులకు సరిపడా గ్యాస్ మాత్రమే ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే లక్షలాది మంది ఆకలితో అలమటించాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
వంటల్లో కోతలు.. కొత్త నిబంధనలు
గ్యాస్ ను ఆదా చేసేందుకు పీజీ యజమానులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
- భోజనాల్లో తగ్గింపు: ప్రస్తుతం మూడు పూటలా ఇస్తున్న భోజనాన్ని రెండు పూటలకే పరిమితం చేయడం.
- మెనూలో మార్పులు: ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను పక్కన పెట్టి, త్వరగా పూర్తయ్యే సాధారణ భోజనం మాత్రమే వండటం.
- వ్యక్తిగత వంటలపై నిషేధం: షేర్డ్ కిచెన్‌లలో నివాసితులు సొంతంగా వండుకోకుండా ఆంక్షలు విధించడం.
- వేడి నీటి నియంత్రణ: నిత్యం వేడి నీటి వాడకాన్ని తగ్గించాలని కోరడం.
హోటళ్లు మూతపడితే మరింత కష్టం
మరోవైపు బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గ్యాస్ సరఫరా లేకపోతే వేలాది హోటళ్లు మూతపడతాయి. పీజీల్లో భోజనం లేకపోతే కనీసం బయట తిందామన్నా హోటళ్లు అందుబాటులో ఉండవు. ఆయిల్ కంపెనీలు 70 రోజుల పాటు నిరంతర సరఫరా ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు ఆకస్మికంగా సరఫరా ఆపడంపై యజమానులు మండిపడుతున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని బెంగళూరు వంటి నగరాల్లో ఈ సంక్షోభాన్ని నివారించాలని కోరుతున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరత సమస్య రోజురోజుకీ ముదురుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. త్వరలోనే దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అప్పటివరకూ ఈ తిప్పలు తప్పవు.


Click it and Unblock the Notifications