Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లోని అత్యంత కీలకమైన పీన్యా ఫ్లైఓవర్ (డాక్టర్ శివకుమార్ స్వామి ఫ్లైఓవర్) వచ్చే వారం నాలుగు రోజుల పాటు మూతపడనుంది. తుమకూరు రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఫ్లైఓవర్‌పై తుది 'లోడ్ టెస్టింగ్' నిర్వహించనుండటమే దీనికి కారణం. దాదాపు 84 గంటల పాటు ఈ ఫ్లైఓవర్‌పై ఎలాంటి వాహనాలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
NHAI ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం, ఏప్రిల్ 13 రాత్రి 11 గంటల నుంచి ఏప్రిల్ 17 ఉదయం 11 గంటల వరకు ఈ ఫ్లైఓవర్ పూర్తిస్థాయిలో మూసివేయబడుతుంది. అంటే సుమారు మూడున్నర రోజుల పాటు తుమకూరు రోడ్డుపై ప్రయాణం భారంగా మారనుంది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, పనుల దృష్ట్యా అనుమతి లభించే అవకాశం ఉంది.
మూసివేతకు అసలు కారణమేంటి?
4.2 కిలోమీటర్ల పొడవైన ఈ పీన్యా ఫ్లైఓవర్ గత కొన్నేళ్లుగా సమస్యలతో సతమతమవుతోంది. 2021లో కేబుల్స్ తుప్పు పట్టడం (Corrosion) వల్ల దీనిని భారీ వాహనాల కోసం మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 32 కోట్ల వ్యయంతో 1,422 పాత కేబుల్స్‌ను కొత్త వాటితో మార్చారు. ఈ మరమ్మతులు విజయవంతమయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు 'ఫైనల్ లోడ్ టెస్ట్' నిర్వహిస్తున్నారు.
ఈ టెస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కటి 32 టన్నుల బరువున్న 8 భారీ ట్రక్కులను ఫ్లైఓవర్‌పై ఎంపిక చేసిన నాలుగు స్పాన్ల (Pillar 54-56 , 115-117) వద్ద నిలిపి ఉంచుతారు. ఈ బరువుకు ఫ్లైఓవర్ ఎంతవరకు తట్టుకుంటుందో ప్రత్యేక గేజ్‌ల ద్వారా కొలుస్తారు. ఈ పరీక్షలో ఫ్లైఓవర్ నెగ్గితే, ఇకపై అన్ని రకాల వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇస్తారు.
ట్రాఫిక్ నరకం తప్పదా?
పీన్యా ఫ్లైఓవర్ మూసివేత వల్ల దాదాపు ఐదు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటుకుంటూ కింద ఉన్న రోడ్డు (Service Road) మీద వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పీన్యా, గోరగుంటెపాళ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా మూసివేస్తే ప్రయాణికులకు చుక్కలు కనిపించడం ఖాయం. అదనపు పోలీసులను మోహరించి ట్రాఫిక్‌ను నియంత్రిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రయాణికులకు సూచనలు
ఏప్రిల్ 14 నుంచి 16 మధ్య తుమకూరు వైపు వెళ్లే వారు వీలైనంత వరకు ప్రయాణ సమయాన్ని మార్చుకోవడం ఉత్తమం. అలాగే ప్రత్యామ్నాయంగా నైస్ రోడ్డు (NICE Road) లేదా ఇతర మార్గాలను పరిశీలించండి. ఇకపోతే ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు లేదా రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు అదనపు సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.


Click it and Unblock the Notifications