బెంగళూరు వాహనదారులకు పార్కింగ్ షాక్.. నివాస ప్రాంతాల రోడ్లపై కారు నిలిపితే రూ. 25 వేలు జరిమానా..
కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసిస్తున్న వాహనదారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతోంది. Bengaluru నగరంలో నాటికనాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని అదుపు చేయడానికి, పద్ధతి లేని ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడానికి కర్ణాటక ప్రభుత్వం తాజాగా ముసాయిదా విధానాన్ని తీసుకువచ్చింది.
ప్రతిపాదిత గ్రేటర్ బెంగళూరు ఏరియా (పార్కింగ్) రూల్స్, 2026 ప్రకారం.. బెంగళూరు నివాసితులు ఇకపై తమ నివాస ప్రాంతాల రోడ్లపై కార్లను నిలిపి ఉంచితే భారీగా వార్షిక రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారులు తమ కారు మోడల్ ఆధారంగా సంవత్సరానికి రూ. 25 వేల వరకు పర్మిట్ రుసుముగా చెల్లించక తప్పదు.
ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం.. నివాస ప్రాంతాల రోడ్లపై నిలిపే వాహనాలకు వార్షిక పార్కింగ్ పర్మిట్లను తప్పనిసరి చేయనున్నారు. చిన్న కార్లకు సంవత్సరానికి రూ. 15 వేలు వరకు పర్మిట్ రుసుమును ప్రతిపాదించగా.. సెడాన్ రకం కార్లకు రూ. 20 వేలు, ఎస్‌యూవీ (SUV) మోడల్ వాహనాల యజమానులు ఏకంగా రూ. 25 వేలు వరకు వార్షిక ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నివాస ప్రాంతాల రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకోవడానికి ఎటువంటి రుసుము లేకపోగా.. ఈ కొత్త ప్రతిపాదన వాహనదారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుంది.

కేవలం నివాస ప్రాంతాలే కాకుండా, ఇతర వ్యాపార, నివాసేతర వీధుల్లో ఆన్-స్ట్రీట్ పార్కింగ్ కోసం గంటల ప్రాతిపదికన పార్కింగ్ ఛార్జీలను నిర్ణయించారు. ఈ రుసుములను రోడ్ వర్గీకరణ ఆధారంగా విభజించారు. కార్ల విషయానికి వస్తే కేటగిరీ సీ రోడ్లపై గంటకు రూ. 40, కేటగిరీ బీ రోడ్లపై రూ. 60, అత్యంత రద్దీ ఉండే కేటగిరీ ఏ రోడ్లపై గంటకు రూ. 80 వసూలు చేయాలని ముసాయిదాలో పేర్కోన్నారు. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. గంటవారీ రుసుములు కేటగిరీ సీ రోడ్లలో రూ. 20, కేటగిరీ బీ రోడ్లలో రూ. 30, కేటగిరీ ఏ రోడ్లలో రూ. 40గా ప్రతిపాదించారు.
వాహనదారులు రోడ్లపై ఎక్కువసేపు వాహనాలు నిలిపి ఉంచకుండా నిరుత్సాహపరచడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం ఒక వాహనం రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌లో ఉంటే.. నిర్ణీత పార్కింగ్ ఛార్జీలు మరింతగా పెరుగుతాయి. వీధుల్లో వాహనాలు నిలపడం కంటే వ్యవస్థీకృత ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ సౌకర్యాలను (పార్కింగ్ కాంప్లెక్సులు/ప్రాంగణాలు) ఉపయోగించుకునేలా వాహనదారులను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ ధరలను సాపేక్షంగా తక్కువగా ఖరారు చేశారు.
ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ వద్ద కార్లకు గంటకు రూ. 20 నుండి రూ. 40 వరకు, బైక్‌లకు రూ. 10 నుండి రూ. 20 వరకు ఛార్జీ విధించనున్నారు. అంతేకాకుండా వీటిలో నెలవారీ పార్కింగ్ సదుపాయాన్ని రూ. వేయి నుండి రూ. 4 వేల మధ్య అందించనున్నారు. విశేషమేమిటంటే.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ ఉపయోగించే వారికి నెలవారీ చందాపై 50 శాతం భారీ తగ్గింపును కూడా ముసాయిదా ప్రతిపాదిస్తోంది.
కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ ఆగస్టు 11న ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించిన నాటి నుండి 30 రోజులలోపు ప్రజలు.. వాహనదారులు తమ అభ్యంతరాలను, సూచనలను ప్రభుత్వానికి సమర్పించవచ్చు. ప్రజాభిప్రాయాలను పరిశీలించిన అనంతరమే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం గనుక అమలులోకి వస్తే బెంగళూరు నగరంలో రోడ్డు పక్కన పార్కింగ్ చేయడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారనుంది.


Click it and Unblock the Notifications
