Bengaluru: పట్టాలెక్కబోతున్న బెంగళూరు పింక్ లైన్ మెట్రో.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..
బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ అంటేనే అందరికీ ఒక పెద్ద యుద్ధం గుర్తొస్తుంది. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయలేక ఐటీ ఉద్యోగులు, సామాన్య జనం నరకం చూస్తుంటారు. అయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు 'నమ్మ మెట్రో' ఒక అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. బెంగళూరు మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పింక్ లైన్ (Pink Line) పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ మార్గంలోని ఎలివేటెడ్ సెక్షన్‌లో మెట్రో రైలు ట్రయల్ రన్స్ ను అధికారికంగా ప్రారంభించారు.

ఏమిటీ పింక్ లైన్ స్పెషాలిటీ?
నమ్మ మెట్రో నెట్‌వర్క్ లో ఈ పింక్ లైన్ (రీచ్ 6) చాలా కీలకం. దక్షిణ బెంగళూరులోని కాలెన అగ్రహార (బన్నెరఘట్ట రోడ్) నుంచి ఉత్తర బెంగళూరులోని నాగవార వరకు ఈ లైన్ విస్తరించి ఉంటుంది. మొత్తం 21.25 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌లో 7.5 కి.మీ ఎలివేటెడ్ (ఫ్లైఓవర్ మీద) కాగా, మిగిలిన 13.75 కి.మీ భూగర్భంలో (Underground) ఉంటుంది.
ట్రయల్ రన్ విశేషాలు ఇవే!
జనవరి 2026, శుక్రవారం రోజున మెట్రో అధికారులు కాలెన అగ్రహార నుంచి తవరేకెరె మధ్య 7.5 కిలోమీటర్ల మేర తొలి ట్రయల్ రన్ నిర్వహించారు. BEML సంస్థ తయారు చేసిన అత్యాధునిక 'డ్రైవర్ లెస్' (Driverless) టెక్నాలజీ కలిగిన 6 కోచ్‌ల రైలును పట్టాలపై పరుగులు పెట్టించారు.
ఈ ట్రయల్ రన్స్ లో ప్రధానంగా కొన్ని అంశాలను పరీక్షిస్తారు..
- • రైలు వేగం & బ్రేకింగ్ సిస్టమ్.
- • సిగ్నలింగ్ & టెలికమ్యూనికేషన్ సమన్వయం.
- • ట్రాక్షన్ & రైలు కదలికల స్థిరత్వం.
అధికారుల సమాచారం ప్రకారం.. ఈ టెస్టింగ్ పక్రియ ఏప్రిల్ 2026 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత సేఫ్టీ క్లియరెన్స్ రాగానే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
ఎప్పటి నుంచి ప్రయాణించవచ్చు?
మెట్రో అధికారులు ఈ లైన్ ను రెండు దశల్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు:
- మొదటి దశ (ఎలివేటెడ్): కాలెన అగ్రహార నుంచి తవరేకెరె వరకు. ఇది మే 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- రెండవ దశ (అండర్ గ్రౌండ్): డెయిరీ సర్కిల్ నుంచి నాగవార వరకు. ఈ మార్గంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది నవంబర్ లేదా డిసెంబర్ 2026 నాటికి పూర్తి కావచ్చు.
రియల్ ఎస్టేట్ పై ప్రభావం
పింక్ లైన్ రాకతో బెంగళూరు (Bengaluru) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకోనుంది.
- ధరల పెరుగుదల: బన్నెరఘట్ట రోడ్, గొట్టిగెరె, హుళిమావు, జేపీ నగర్ పరిసరాల్లో ప్రాపర్టీ రేట్లు పెరగనున్నాయి.
- కమర్షియల్ హబ్: జయదేవ హాస్పిటల్, ఎంజీ రోడ్, నాగవార వంటి ఏరియాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల కొత్త ఆఫీసులు, షాపింగ్ మాల్స్ వెలిసే అవకాశం ఉంది.
- ఐటీ ఉద్యోగులకు ఊరట: ఒరాకిల్, IIMB వంటి పెద్ద సంస్థలు, ఫోర్టిస్, అపోలో వంటి ఆసుపత్రులకు వెళ్లే వారికి ఈ మెట్రో లైన్ వరంలా మారనుంది.
మొత్తానికి పింక్ లైన్ మెట్రో అందుబాటులోకి వస్తే ఉత్తర-దక్షిణ బెంగళూరు మధ్య ప్రయాణం చాలా సులువు అవుతుంది. అలాగే బెంగళూరు రియల్ ఎస్టేట్ కు ఈ మెట్రో సరికొత్త బూస్ట్ నిచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications