Bengaluru: బెంగళూరు టూ ముంబై కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ఒక తీపి కబురు అందించింది. బెంగళూరు , ముంబై నగరాల మధ్య కొత్తగా ప్రకటించిన వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. కొత్తగా ప్రారంభం కాబోతున్న SMVT బెంగళూరు - లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) - SMVT బెంగళూరు బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై తుమకూరు (Tumakuru) స్టేషన్‌లో కూడా ఆగనుందని రైల్వే శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్టాపేజ్ వల్ల తుమకూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ముంబై వెళ్లడం మరింత ఈజీ కానుంది.

మే 23 నుండి సేవలు షురూ.. టైమింగ్స్ ఇవే!
ఈ సరికొత్త రైలు సర్వీసులు మే నెల నాలుగో వారం నుండి పట్టాలెక్కనున్నాయి. ట్రెయిన్ నంబర్ 16553 SMVT బెంగళూరు LTT బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ మే 23 నుండి ప్రారంభం కానుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్రెయిన్ నంబర్ 16554 LTT-SMVT బెంగళూరు బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ మే 24 నుండి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది.
రైల్వే టైమ్ టేబుల్ ప్రకారం.. ట్రెయిన్ నంబర్ 16553 బెంగళూరు నుండి బయలుదేరి రాత్రి 10:13 గంటలకు తుమకూరు చేరుకుంటుంది, అక్కడ రెండు నిమిషాల హాల్ట్ తర్వాత 10:15 గంటలకు ముంబై వైపు కదులుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ట్రెయిన్ నంబర్ 16554 ముంబై నుండి వచ్చి రాత్రి 8:03 గంటలకు తుమకూరు చేరుకుని, తిరిగి 8:05 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతుంది.
వారానికి రెండు రోజులు.. ఏయే రోజుల్లో నడుస్తుందంటే?
ఈ రైలు వారానికి రెండు రోజులు (బై-వీక్లీ) ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ట్రెయిన్ నంబర్ 16553 ప్రతి శనివారం , మంగళవారాల్లో రాత్రి 8:35 గంటలకు బెంగళూరు (Bengaluru) లో బయలుదేరి, మరుసటి రోజు (ఆదివారం, బుధవారం) రాత్రి 8:40 గంటలకు ముంబైలోని LTT స్టేషన్‌కు చేరుకుంటుంది.
రిటర్న్ డైరెక్షన్‌లో ట్రెయిన్ నంబర్ 16554 ప్రతి ఆదివారం , బుధవారాల్లో రాత్రి 11:15 గంటలకు ఎల్‌టీటీ (LTT) లో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం, గురువారం) రాత్రి 10:30 గంటలకు ఎస్ఎమ్‌వీటీ బెంగళూరుకు చేరుకుంటుంది.
స్టాపేజ్‌లు ఎక్కువే.. కానీ స్పీడ్ పైనే ప్రయాణికుల అసంతృప్తి!
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తుమకూరుతో పాటు దావణగెరె, హుబ్బళ్ళి, ధార్వాడ్, బెలగావి, మిరాజ్, సాంగ్లి, కరాడ్, సతారా, లోనంద్, పూణే, లోనావాలా, కర్జాత్, కల్యాణ్ , థానే స్టేషన్లలో ఆగుతుందని ఎస్‌డబ్ల్యూఆర్ తెలిపింది.
అయితే, ఈ రైలు ప్రయాణ సమయం (లాంగ్ షెడ్యూల్) పై రైల్వే ప్రయాణికుల నుండి కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రైలు మొత్తం 1,209 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 24 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటుంది. అంటే దీని సగటు వేగం గంటకు కేవలం 52 కిలోమీటర్లు మాత్రమే. ఇది సాధారణ సూపర్‌ఫాస్ట్ రైలు వేగం కంటే తక్కువగా ఉండటంతో ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కర్ణాటక రైల్వే వేదికకు చెందిన కె.ఎన్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ రైలు టైమింగ్స్ కొంత నిరాశపరిచినప్పటికీ, బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్‌లో కూడా స్టాపేజ్ ఇస్తే ప్రయాణికులకు మరింత కాస్త ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications