Bengaluru: నానమ్మను ఆఫీస్‌కు తీసుకెళ్లిన బెంగళూరు టెక్కీ! నెటిజన్లు ఫుల్ ఎమోషనల్..!
జీవితంలో ఎంత పెద్ద పొజిషన్‌కు వెళ్లినా, ఎంత సంపాదించినా.. మన సక్సెస్‌ను చూసి మన తల్లిదండ్రులు, పెద్దవాళ్లు గర్వపడినప్పుడు వచ్చే సంతోషమే వేరు. ఆ సంతోషం ముందు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే ప్రమోషన్లు, అవార్డులు అన్నీ దిగదుడుపే అంటున్నాడు బెంగళూరు (Bengaluru) లోని మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యంకటేష్ బజాజ్. తాజాగా ఆయన తన 81 ఏళ్ల నానమ్మను మొదటిసారి తను పనిచేసే హైటెక్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఎమోషనల్ స్టోరీని లింక్డ్‌ఇన్ (LinkedIn) లో షేర్ చేయగా.. అది కాస్తా ఇంటర్నెట్‌లో అందరి హృదయాలను గెలుచుకుంది.
మహారాష్ట్రలోని ఒక చిన్న పల్లెటూరు నుండి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్ కంపెనీ మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యంకటేష్.. ఈ క్షణం తన జీవితంలోనే అత్యంత విలువైనదని చెప్పుకొచ్చాడు.

టీవీలో చూసిన గాజు బిల్డింగ్‌లు.. ఇప్పుడు నానమ్మతో కలిసి!
వ్యంకటేష్ మహారాష్ట్రలోని 'మంగ్రుల్‌పిర్' అనే ఒక వెనుకబడిన మారుమూల గ్రామంలో పెరిగాడు. చిన్నప్పుడు టీవీల్లో పెద్ద పెద్ద ఐటీ ఆఫీసుల గాజు బిల్డింగ్‌లను చూస్తూ.. ఎప్పటికైనా అలాంటి చోట పనిచేయాలని కలలు కనేవాడు. ఒక దశాబ్దం తర్వాత, ఇప్పుడు అదే బెంగళూరు (Bengaluru) మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో తన 81 ఏళ్ల నానమ్మ చేతిని పట్టుకుని ఆఫీస్ అంతా తిప్పి చూపించడం ఒక అద్భుతమైన అనుభూతి అని ఆయన రాసుకొచ్చాడు.
ఆమెకు కార్పొరేట్ ఆఫీస్ లోపలికి వెళ్లడం అదే మొదటిసారి. అక్కడ టెక్నాలజీని, అంత పెద్ద ఎత్తున జరుగుతున్న పనిని చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. "ఒకే చోట ఇంత మంది కలిసి, ఇంత పెద్ద ఎత్తున ఎలా పని చేస్తారురా?" అని అమాయకంగా, ఎంతో కుతూహలంగా అడిగిందట.
తరాల త్యాగాలకు దక్కిన గౌరవం!
ఆమెకు ఎలాంటి ఫార్మల్ చదువు లేకపోయినా, ఆలోచనల్లో ఎంతో ప్రోగ్రెసివ్‌గా ఉంటుందని వ్యంకటేష్ చెప్పాడు. ఆఫీస్ అంతా చూశాక ఆమె మనవడి వైపు చూసి.. "నువ్వు చాలా అర్ధవంతమైన, మంచి పని చేస్తున్నావురా" అని అంది. ఆ ఒక్క మాట తనకు కంపెనీలో వచ్చే ఏ ప్రమోషన్ లేదా టైటిల్ కంటే చాలా పెద్దదని, ఆ రోజు నానమ్మ కళ్లల్లో తన సక్సెస్ చూసుకున్నప్పుడు తన కాలర్ ఎగరేసినంత పని అయిందని ఎమోషనల్ అయ్యాడు. ఇది కేవలం ఒక ఆఫీస్ విజిట్ మాత్రమే కాదని, తమ కుటుంబంలో తరతరాలుగా చేసిన త్యాగాలకు దక్కిన ప్రతిఫలమని అన్నాడు.
నెహ్రూ చేతుల మీదుగా అవార్డు పొందిన ఫ్యామిలీ లెగసీ
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక యూజర్ వ్యంకటేష్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తూ.. "ఇతను మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన జిల్లా నుండి వచ్చాడు. కానీ వీళ్ల తాతగారు అప్పట్లో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా 'ప్రోగ్రెసివ్ ఫార్మర్' (ఉత్తమ రైతు) అవార్డు అందుకున్నారు. మనవడు ఇప్పుడు ఆ ఫ్యామిలీ లెగసీని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు" అని కామెంట్ పెట్టాడు.
సొంతూరి మూలాలను మర్చిపోకుండా, ఇంత పెద్ద పొజిషన్‌లో ఉండి కూడా నానమ్మకు అంతటి గౌరవాన్ని ఇచ్చిన ఈ మనవడి కథ నిజంగానే అందరికీ ఇన్‌స్పిరేషన్ కదా!


Click it and Unblock the Notifications