బెంగళూరు వాసులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు..ఎంతలా అంటే..
బెంగళూరు వాసులకు బిగ్ షాక్.. ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి మెట్రోను ఆశ్రయించే వారి జేబులకు చిల్లులు పడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరు నమ్మ మెట్రో ఛార్జీలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛార్జీల స్థిరీకరణ కమిటీ (Fare Fixation Committee - FFC) చేసిన సిఫార్సుల మేరకు.. మెట్రో టికెట్ ధరలను సంవత్సరానికి గరిష్టంగా 5 శాతం వరకు పెంచే ప్రతిపాదనను బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ముందుకు తీసుకువచ్చింది. ఈ నిర్ణయం ఇప్పటికే అధికారికంగా బహిర్గతం కావడంతో.. నగరంలోని లక్షలాది మెట్రో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.
మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టం, 2002లోని సెక్షన్ 33 ప్రకారం.. FFC సిఫార్సులు అమలు చేయడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల ప్రకారం BMRCL గతంలో కూడా ఛార్జీల పెంపును అమలు చేసింది. ఫిబ్రవరి 2025లో.. 2017 తర్వాత తొలిసారిగా మెట్రో టికెట్ ధరలు సవరించబడ్డాయి. అప్పట్లో కొన్ని మార్గాల్లో ఛార్జీలు ఏకంగా 71 శాతం వరకు పెరగడం నగర వ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

గత ఏడాది BMRCLకు సమర్పించిన FFC నివేదిక ప్రకారం.. 2026 ఫిబ్రవరి నుంచి ప్రతి ఏడాది ఆటోమేటిక్‌గా ఛార్జీలను 5 శాతం వరకు పెంచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ విధానం ద్వారా సంస్థ తన ఆపరేటింగ్ నిష్పత్తిని మెరుగుపరచాలని భావిస్తోంది. పారదర్శకమైన ఫార్ములా ఆధారంగా ఛార్జీలను సవరించకపోతే.. BMRCL నికర నష్టం 2029-30 నాటికి రూ.577 కోట్లకు చేరవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే, ఈ ప్రతిపాదన ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది పెద్ద ఎత్తున ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో, మరోసారి పెంపు సాధారణ ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
Bengaluru రోజువారీ ప్రయాణికుడైన వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణం ప్రీమియం సేవ కాదు, అది అందుబాటులో ఉండాలి. గత సంవత్సరం పెంపు తర్వాత ఇప్పుడు మళ్లీ ఛార్జీలు పెంచడం అన్యాయమని వ్యాఖ్యానించారు. మరో ప్రయాణికుడు వెంకటేష్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో రైళ్లు సామర్థ్యానికి మించి నిండిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మెట్రోను లగ్జరీ సర్వీస్‌గా చూడడం హాస్యాస్పదం. ఎక్కువ చెల్లించాలా లేక ట్రాఫిక్‌లో గంటల కొద్దీ చిక్కుకోవాలా అనే పరిస్థితికి ప్రజలు నెట్టబడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
రవాణా నిపుణులు కూడా ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీలు మరింత పెరిగితే, చాలా మంది ప్రయాణికులు బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపవచ్చని, దీని వల్ల ఇప్పటికే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్న బెంగళూరు నగరంలో రద్దీ మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మొబిలిటీ నిపుణుడు సత్య అరికుథర్మ్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించారు. ఛార్జీల గణనలో తప్పు ఫార్ములా ఉపయోగించడం వల్ల ప్రయాణికులు ఇప్పటికే సుమారు 32 శాతం అదనంగా చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల నుంచి బలమైన వ్యతిరేకత లేకపోవడమే BMRCLను మరోసారి ఛార్జీల పెంపు గురించి ఆలోచించే స్థాయికి తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రయాణికుల పక్షాన నిలబడి.. మెట్రో అధికారులపై మరింత జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


Click it and Unblock the Notifications