బెంగళూరు మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ ఏరియాలో 7.5 కి.మీ మెట్రో పింక్ లైన్ త్వరలో అందుబాటులోకి ..
Bengaluru Metro Update: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ తిప్పలతో విసిగిపోయిన ప్రయాణికులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుంది. బన్నేర్‌ఘట్ట రోడ్డు వెంబడి నిర్మించిన బెంగళూరు మెట్రో పింక్ లైన్‌లోని 7.5 కిలోమీటర్ల కాలేన అగ్రహార - తావరకెరె మార్గాన్ని ఈ నెలలోనే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని కాలేన అగ్రహారాన్ని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న నాగవారతో కలిపే 21.25 కిలోమీటర్ల సుదీర్ఘమైన పింక్ లైన్ మార్గంలో ఈ ఎలివేటెడ్ విభాగం అత్యంత కీలకమైన భాగం. అయితే, ఈ మార్గం ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక తేదీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తోంది.
ఈ కొత్త లైన్ సిద్ధమవ్వడంతో బుధవారం నాడు నిర్వహించిన ట్రయల్ రన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ మార్గాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, ఎమ్మెల్యే ఎం. కృష్ణప్ప, మెట్రో ఎండీ పీసీ జాఫర్‌లతో కూడిన బృందం రైలు ప్రయాణంతో పాటు స్టేషన్లలో మౌలిక వసతులను పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తేదీ ఖరారైన వెంటనే ఈ లైన్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. సెప్టెంబరు నెలలోనే దీనికి అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.

అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రయాణికుల నుంచి సోషల్ మీడియాలో విభిన్న ప్రతిస్పందనలు వచ్చాయి. అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమాల కోసం సమయాన్ని వృథా చేయకుండా, పనులు పూర్తయిన వెంటనే వాణిజ్య సేవలను ప్రారంభించాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భద్రతా ధృవీకరణ పత్రాలు, కార్యాచరణ షెడ్యూళ్లపై మెట్రో రైల్ భద్రతా కమిషనర్ (CMRS)తో మాట్లాడినట్లు ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించారు. రాబోయే 15 రోజుల్లో రోలింగ్ స్టాక్ ఆమోదంతో పాటు మొత్తం లైన్‌కు క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నామన్నారు. ఈ అనుమతులు త్వరగా వచ్చేలా రైల్వే బోర్డు ఛైర్మన్, కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతానని చెప్పారు.
నగరంలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు 'టన్నెల్ రోడ్' వంటి అశాస్త్రీయ, వ్యర్థ ప్రణాళికల కంటే ప్రజా రవాణా ప్రాజెక్టులే శ్రేయస్కరమని తేజస్వి సూర్య అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో, బన్నేర్‌ఘట్ట రోడ్డులో సరిగా లేని పాదచారుల ఫుట్‌పాత్‌ల సమస్యను పరిష్కరించాలని, కాలినడకన వెళ్లేవారు ప్రధాన రహదారిపై నడవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు మంత్రి కృష్ణ బైరే గౌడ దృష్టికి తెచ్చారు. అన్ని భద్రతా అనుమతులు 1-2 వారాల్లో పూర్తవుతాయని భరోసా దక్కిన నేపథ్యంలో.. పింక్ లైన్ ప్రారంభం బెంగళూరు ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
