బెంగళూరులో అత్యంత పొడవైన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, రూ. 9,700 కోట్లు విడుదలకు మంత్రివర్గం ఆమోదం
బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్ట్ ఇప్పుడు వేగం అందుకుంది. కర్ణాటక మంత్రివర్గం గురువారం రూ. 9,700 కోట్ల విలువైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా నెలల తరబడి నిలిచిపోయిన సివిల్ పనులకు మార్గం సుగమం అవుతోంది. కొత్త ప్రణాళిక ప్రకారం.. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) రెండు ప్రధాన కారిడార్‌లలో ఫ్లైఓవర్‌లపై ఎలివేటెడ్ మెట్రో లైన్లను నిర్మించనుంది. ఇది నగరానికి కొత్త తరహా మౌలిక వసతులను అందించబోతుంది.
మొదటి కారిడార్ జెపి నగర్ 4వ దశ నుండి కెంపాపుర వరకు ఔటర్ రింగ్ రోడ్ (ORR) పశ్చిమ భాగంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 28.486 కి.మీ పొడవైన ఫ్లైఓవర్ ఉండనుంది, ఇది ఇప్పటివరకు బెంగళూరులో నిర్మించబడిన అతి పెద్ద ఫ్లైఓవర్ అవుతుంది. రెండవ కారిడార్ మాగడి రోడ్డులోని హోసహళ్లి నుండి కడబాగెరె వరకు విస్తరించనుంది. ఇది 8.635 కి.మీ. పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు కారిడార్‌లు కలిపి మొత్తం 37.121 కి.మీ. పొడవైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇందులో రోడ్డు మార్గాలు, మెట్రో లైన్లు ఒకే వయాడక్ట్‌లో అమలు కావడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

కేంద్రపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ వివరించిన ప్రకారం.. మొత్తం ఖర్చులో సివిల్ పనులు, భూసేకరణ, డిజైన్, ఇతర నిర్మాణ వ్యయాలు ఉన్నాయి. ఇందులో Bengaluru Metro లైన్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఫ్లైఓవర్ నిర్మాణ ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10శాతం పట్టణ స్థానిక సంస్థలు భరిస్తాయి. మిగిలిన 40 వాతం నిధులను రుణాల రూపంలో సేకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2025-26 బడ్జెట్‌లో నమ్మ మెట్రో కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించింది. ఆ నిధుల్లో కొంత భాగాన్ని ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించనున్నారు.
మొదట 44.65 కి.మీ పొడవుతో ప్రణాళిక వేసిన డబుల్ డెక్కర్ వయాడక్ట్‌ను సవరించి 37.121 కి.మీ.కు కుదించారు. ఆగస్టు 2024లో కేంద్ర కేబినెట్ ఫేజ్ 3కి ఆమోదం తెలిపింది. రాష్ట్ర కేబినెట్ ఇప్పుడు తుది ఆమోదం ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రాథమికంగా నాలుగు ప్యాకేజీలకు టెండర్లు సెప్టెంబర్‌లో విడుదలవుతాయి. ఇవి స్టేషన్లు, వయాడక్ట్‌ల నిర్మాణాన్ని కవర్ చేస్తాయి. కాంట్రాక్టర్లకు 45 నుండి 60 రోజులు సమయం ఇస్తారు. నవంబర్ మధ్య నాటికి టెండర్లకు తుది ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు.
అన్ని సక్రమంగా జరిగితే, 2025 జనవరిలో గ్రౌండ్ వర్క్ ప్రారంభం కావచ్చు. అయితే, డబుల్ డెక్కర్ వయాడక్ట్ రూపకల్పన కారణంగా కొన్ని ఆలస్యాలు ఇప్పటికే జరిగాయి. ఈ కారణంగా ప్రాజెక్ట్ పూర్తి కాలపరిమితి ఆరు నెలలు పెరిగింది. ఫేజ్ 3 ఇప్పుడు అసలు అంచనా వ్యయం 5 శాతం ఎక్కువ ఖర్చుతో రూ. 15,611 కోట్ల కానుంది. 2030 బదులుగా 2031 మే నాటికి సిద్ధం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications