బెంగళూరు మెట్రో ప్రయాణికులకు మరోసారి భారీ షాక్..ఛార్జీలను అమాతం పెంచేసిన BMRCL, ఈ సారి ఎంతంటే..
Bengaluru Metro Fare Hike: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రయాణికులకు ఫిబ్రవరి 2024లో ఇప్పటికే 71 శాతం ఛార్జీల పెంపును అమలు చేసిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి వార్షికంగా 5 శాతం పెంపును అమలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఈ పెంపు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జీల నిర్ణయ కమిటీ (FFC) ప్రతీ సంవత్సరం 5 శాతం పెంపును సిఫార్సు చేయడం విశేషం. ఈ సిఫార్సు ఆమోదమైతే, తదుపరి పెంపును ఫిబ్రవరి 2026లో అమలు చేయొచ్చు.
ఈ నేపథ్యంలో BMRCL మొత్తం 7.5 సంవత్సరాల్లో 105 శాతం ఛార్జీల పెంపును కోరుతోంది. బేస్ ఫేర్ రూ.21 నుండి గరిష్ట ఛార్జీ రూ.123 వరకు పెరిగే అవకాశముంది. అయితే, ఈ పెంపుపై పూర్తి వివరాలతో FFC నివేదికను BMRCL సుమారు ఏడు నెలాల పాటు ప్రజలకు విడుదల చేయలేదు. అనేక RTI దరఖాస్తులు తిరస్కరించబడిన తర్వాత ఈ విషయం హైకోర్టుకు చేరడంతో, BMRCL తన వెబ్‌సైట్‌లో ఈ నివేదికను ప్రచురించింది.

BMRCL విజయవంతంగా మెట్రో సర్వీసులు ప్రారంభించినప్పటి నుంచి భారీ నష్టాలలో కొట్టుమిట్టాడుతోంది. 2019-20లో రూ.641 కోట్లు నష్టం నమోదు కాగా, 2020-21లో అది రూ.905 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఈ నష్టాలు మరింత పెరిగాయి. 2023-24 నష్ట పరిమాణం రూ.627 కోట్లు. అలాగే, మెట్రో విస్తరణ, నిర్వహణ, ఇంధన ఖర్చులు, సిబ్బంది జీతాలు, రుణ వడ్డీ చెల్లింపులు వంటి భారం రోజురోజుకూ పెరుగుతూ ఉండటం కూడా కీలకం. BMRCL తెలిపిన ప్రకారం, 2025-26 నాటికి రుణ అసలు మరియు వడ్డీ చెల్లింపులకు రూ.775 కోట్లు అవసరం అవుతాయి. ఇది 2029-30 నాటికి రూ.2,776 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
అక్టోబర్ 2024లో చార్జీల పెంపుపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానించగా, 1,126 మంది స్పందించారు. అందులో 51 శాతం మంది ఛార్జీల పెంపును ఖండించారు. 27 శాతం మంది మాత్రమే సహేతుకమైన పెంపును అంగీకరించారు. విద్యార్థుల పాస్‌లు, నెలవారీ పాస్‌లు, ఆదివారాల్లో ఉచిత ప్రయాణం వంటి డిమాండ్లు ముఖ్యంగా వచ్చాయి. అయితే BMRCL 5 శాతం మాత్రమే తగ్గింపు ఇవ్వగలమని తెలిపింది. స్మార్ట్ కార్డ్ కనీస బ్యాలెన్స్ విధానాన్ని తొలగించడం సాంకేతిక పరంగా సాధ్యం కాకపోవడం, అదివారాలు, సెలవుల రోజుల్లో పూర్తి ఉచిత ప్రయాణం కాకుండా అదనపు తగ్గింపును మాత్రమే అందించనున్నట్లు తెలియజేసింది.
BMRCL ఈ నిర్ణయాన్ని ప్రజలపై భారంగా ఉన్నప్పటికీ, సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం అవసరమని పేర్కొంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఛార్జీల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ప్రయాణికులు నిరసన తెలుపుతున్నప్పటికీ, సంస్థ ఆర్థిక భారం, మెట్రో వ్యవస్థను సుస్తిరంగా కొనసాగించడమే ప్రధాన ఉద్దేశ్యంగా BMRCL తెలిపింది.


Click it and Unblock the Notifications