మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు తిన్న తర్వాత బిల్లు కట్టడం సహజం. కానీ, చాలా హోటళ్లు బిల్లులో మనకు తెలియకుండానే 'సర్వీస్ ఛార్జ్' (Service Charge) పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తుంటాయి. చాలామంది ఇది తప్పనిసరి అని భావించి కట్టేస్తుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక యువకుడు మాత్రం దీనిపై గళమెత్తాడు. తన అనుమతి లేకుండా బిల్లులో వేసిన సర్వీస్ ఛార్జీని వ్యతిరేకించి, కోర్టు మెట్లు ఎక్కి మరీ విజయం సాధించాడు. ఈ సంఘటన ఇప్పుడు బెంగళూరు (Bengaluru) లో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?
చిక్కలసంద్రకు చెందిన 27 ఏళ్ల హర్ష ప్రభాకర్.. 2025 ఆగస్టు 18 న తన స్నేహితులతో కలిసి రాజరాజేశ్వరి నగర్ లోని 'స్టోరీస్ బార్ అండ్ కిచెన్' అనే రెస్టారెంట్ కు వెళ్ళాడు. సరదాగా గడిపిన తర్వాత బిల్లు చూస్తే షాక్ అయ్యాడు. మొత్తం బిల్లు రూ. 3,443 కాగా.. అందులో హోటల్ యాజమాన్యం పది శాతం అంటే రూ. 307 సర్వీస్ ఛార్జీని కలిపేసింది.
తన ప్రమేయం లేకుండా, తనను అడగకుండా ఈ ఛార్జీని ఎలా వేస్తారని హర్ష ప్రశ్నించాడు. అది ఐచ్ఛికం (Optional) అని, దాన్ని తీసేయమని కోరాడు. కానీ, రెస్టారెంట్ సిబ్బంది మొండిగా వ్యవహరించారు. "మా హోటల్ రూల్స్ ప్రకారం ఇది కట్టాల్సిందే" అని తేల్చి చెప్పారు. వేరే దారి లేక హర్ష ఆ డబ్బులు కట్టి, జరిగిన అన్యాయంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
కోర్టు తీర్పు ఏమంటోంది?
ఈ కేసును విచారించిన బెంగళూరు జిల్లా వినియోగదారుల కమిషన్.. హోటల్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) 2022 గైడ్‌లైన్స్ ప్రకారం.. హోటళ్లు లేదా రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ ఛార్జీని ఆటోమేటిక్ గా చేర్చకూడదు. ఏదైనా హోటల్ లో ఇచ్చే టిప్ లేదా సర్వీస్ ఛార్జ్ అనేది పూర్తిగా కస్టమర్ ఇష్ట ప్రకారం ఉండాలి. మెనూ కార్డుపై రాసినంత మాత్రాన అది కస్టమర్ ను కట్టమని ఒత్తిడి చేయడానికి చెల్లదు. హర్ష ప్రభాకర్ చేసిన వాదనను కోర్టు సమర్థించింది. హోటల్ యాజమాన్యం కోర్టుకు కూడా హాజరుకాకపోవడంతో.. వారు తప్పు చేసినట్లు కమిషన్ నిర్ధారించింది.
కస్టమర్ కు దక్కిన ఊరట..
కోర్టు ఈ కేసులో హోటల్ కు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. హర్ష దగ్గర వసూలు చేసిన రూ. 307 సర్వీస్ ఛార్జీని 18 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, కస్టమర్ కు కలిగించిన మానసిక ఇబ్బందికి గాను రూ. 5,000 పరిహారం.. కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో బెంగళూరులోని వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన పెరిగింది. హోటల్ కు వెళ్ళినప్పుడు బిల్లును జాగ్రత్తగా గమనించాలని, సర్వీస్ ఛార్జీని బలవంతంగా వసూలు చేస్తే తిరగబడాలని ఈ ఘటన నిరూపించింది. ఇది కేవలం ఒక్క హర్ష విజయం మాత్రమే కాదు, అన్యాయంగా అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న ప్రతి వినియోగదారుడి గెలుపు.


Click it and Unblock the Notifications